గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ఇప్పట్లో ఎత్తేసేట్టుగా లేదు. ఆయన చుట్టూ వివాదాలు మరింత ఎక్కువ కావడంతో.. పార్టీకి మరికొద్ది రోజులు దూరం తప్పేలా లేదు. దీంతో ఈ నియోజక వర్గంలో ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకే ఆయన నియోజక వర్గంలో రాజాసింగ్ ప్లేస్ లో యాక్టివిటీ పెంచినట్టు తెలుస్తోంది.
చాలా కాలంగా గోషామహల్ నియోజకవర్గంలో సెకండ్ లీడర్ గా కొనసాగుతున్న విక్రమ్ గౌడ్ మొన్నటి శ్రీరామ నవమి నుంచి స్పీడ్ పెంచారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన బస్తీవాసులతో కలిసి వారి ఆశ్వీర్వాదాలను తీసుకున్నారు. అంతే కాదు తన తండ్రి మిత్రులు, అనుచరులను కలిసి అప్యాయంగా పలకరించి వారి మద్దతును కోరారు.
అంతే కాదు ఈ మధ్య కాలంలో ఆయన జాంబాగ్ డివిజన్ కట్టెలమండిలో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ వంటి కార్యక్రమాల్లో కూడా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అయితే ఈ సారి రాజా సింగ్ స్థానంలో తాను పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకునే క్రమంలోనే ఆయన నియోజక వర్గంలోని అన్ని వర్గాల ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే.. ఎమ్మెల్యే రాజా సింగ్ పై ఇప్పటికే పార్టీ సస్పెన్షన్ వేటు వేయగా.. ఆయన తీరు మాత్రం మారడం లేదు. త్వరలోనే ఎన్నికలున్న నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని అధిష్టానం హెచ్చరించినప్పటికి ఆయన శ్రీరామనవమి రోజున శోభయాత్రలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన పై మరిన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. అందుకే ఆయన స్థానంలో విక్రమ్ గౌడ్ కు ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది.
మరో వైపు రాజాసింగ్ కూడా ఈ సారి ఎంపీ స్థానానికి పోటీ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఆయన జహీరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు. ఎందుకంటే అక్కడ హిందూ ఓట్లు అధికంగా ఉండడమే కారణం.