ప్రధాని మోడీ కోసం పని చేసిన మాజీ న్యాయమూర్తులు గవర్నర్లు అయ్యారని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ నియామకాన్ని ఈ పార్టీ ప్రస్తావించింది. అయోధ్య రామ మందిరం కేసుతో బాటు ట్రిపుల్ తలాక్ కేసు, డీమానిటైజేషన్ కేసు వంటి వాటిలో అబ్దుల్ నజీర్ లోగడ తీర్పులిచ్చారని ఈ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన.. రిటైర్మెంట్ కి ముందు జడ్జీలు ఇచ్చే తీర్పులు వారి రిటైర్మెంట్ తరువాత జాబ్స్ ని ‘ప్రభావితం’ చేస్తాయంటూ దివంగత అరుణ్ జైట్లీ 2012 లో చేసిన ఓ వ్యాఖ్య తాలూకు వీడియోను తన ట్వీట్ కి జోడించారు.
గత మూడు నాలుగేళ్లుగా ఇలా జరుగుతోందనడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే బీజేపీ నేత బీఎల్. సంతోష్ దీన్ని ఖండిస్తూ.. రిటైర్డ్ జడ్జి అబ్దుల్ నజీర్ నియామకాన్ని తప్పు పట్టడం హేయమన్నారు.
‘శ్రీరామ్ జన్మభూమి ‘కేసులో తీర్పు ఇవ్వడమే ఆయన పాపమైందా అని సంతోష్ తిప్పికొట్టారు. ‘నేను చెప్పినట్టు చెయ్యి’ అన్న కాంగ్రెస్ విధానం సరికాదన్నారు. ఏ విషయంపై నైనా విమర్శించేముందు అది హేతుబద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.