మరో 10 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది కార్తికేయ-2 సినిమా. ప్రచారం కోసం నిఖిల్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాడు. అన్ని రకాల కార్యక్రమాల్ని తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే నిఖిల్ మినహా, ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి మరో స్టార్ ఫేస్ లేదక్కడ. మరి ఈ మొత్తం వ్యవహారంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఏమైంది?
సాధారణంగా ఓ సినిమా రిలీజ్ ఉందంటే, ముందుగా రంగంలోకి దిగేది హీరోయిన్ మాత్రమే. ముద్దుగుమ్మ కెమెరా ముందుకొస్తే మీడియా ఎటెన్షన్ ఆటోమేటిగ్గా ఉంటుంది. దీంతో సినిమాకు బజ్ వస్తుంది. కానీ, కార్తికేయ 2 విషయంలో అది జరగలేదు. ఇప్పటివరకు అనుపమ పరమేశ్వరన్ ప్రచారానికి రాలేదు. దీంతో ఎన్నో అనుమానాలు రాజుకున్నాయి.
కార్తికేయ 2 సినిమాకు పోటీగా మాచర్ల నియోజకవర్గం వస్తోంది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. వారు ఆల్రెడీ రంగంలోకి దూకేశారు. జోరుగా తమ సినిమాకు ప్రచారం కల్పిస్తున్నారు. కానీ, అనుపమ మాత్రం కార్తికేయ 2 కోసం ఇప్పటివరకు ప్రచారం ప్రారంభించలేదు. అయితే, ఈ విషయంలో అనుపమ తప్పులేదు.
నిజానికి కార్తికేయ 2 సినిమా గతనెల 22న రిలీజ్ అవ్వాలి. ఆ డేట్ కోసం ప్రమోట్ చేసేందుకు, అనుపమ కాల్షీట్లను సిద్ధం చేశారు. కట్ చేస్తే, రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు ప్రచారం చేద్దామంటే అనుపమ బిజీ అయిపోయింది. ఆమె చేస్తున్న 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. పైగా కాంబినేషన్ సీన్లు పడ్డాయి. దీంతో ఎటూ కదల్లేని పరిస్థితిలో ఉండిపోయింది అను బేబీ.
ఇదే విషయాన్ని బాధగా తెలియజేసింది. కార్తికేయ 2 సినిమా తనకు చాలా ఇష్టమైన మూవీ అని.. కానీ, టైమ్ కుదరక ప్రచారం చేయలేకపోతున్నానని వెల్లడించింది. అనుపమ స్టేట్ మెంట్ తో ఇన్నాళ్లూ ఆమెపై జరిగిన అసత్య ప్రచారానికి తెరపడింది.