ముందు మన దగ్గర సమాధానం లేదు. కేంద్రం కోత వేస్తుంటే… నువ్వు ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తావు గురూ అని ఉండవల్లి గట్టిగా నిలదీసి వారం అవుతోంది. దానికి సమాదానం లేదు. కాని చంద్రబాబు మాత్రం అనిల్ కుమార్ యాదవ్ కు సమాధానం చెప్పాలంట. చంద్రబాబు తప్పులు చేయబట్టే కదా.. ప్రతిపక్షంలో ఉండి మీతో మాటలు పడుతుంది.. మరి మీరేం చేస్తారు అని ఉండవల్లి ఇప్పటికే అడిగారు.. అయినా వాటికి సమాధానం ఇవ్వలేదు. పోలవరం మేమే పూర్తి చేస్తాం.. ఎత్తు తగ్గించం ఇదే పాట పాడారు తప్ప.. ఎలా అనేది మాత్రం చెప్పలేకపోయారు.
ఎంతసేపు అసెంబ్లీలో చంద్రబాబు రేటు తక్కువకు ఒప్పుకున్నాడు.. పాత అంచనాలకు కేంద్ర మంత్రివర్గంలోని మీ మంత్రులెందుకు ఆమోదం తెలిపారని అనటం తప్ప… వారేం చేయబోతున్నారు.. ఎలా పూర్తి చేయబోతున్నారనేది ఒక క్లారిటీ మాత్రం ఇవ్వలేకపోయాడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. హావభావాలు.. డైలాగులు మాత్రం.. కేజీఎఫ్ సినిమాను మించిపోయాయి. ఎక్కడా తగ్గకుండా ఎగిరెగిరి పడి.. ఎనక్కి వెళ్లి ఏడుస్తూ కూర్చున్నాడంట ఎనకటికొకడు.. అలాగే ఉంది మంత్రి అనిల్ కుమార్ పరిస్ధితి. అవతల కేంద్రం సరిగా స్పందించటం లేదు.. నిధులు ఇంతే ఇస్తామంటూ తేల్చిపారేస్తోంది.. అయినా తెరపైకి వచ్చి కట్టి తీరతాం అంటూ గట్టిగా చెప్పి.. వెనక్కి పోయి ఎలా చేయాలి.. ఏం చేయాలి.. ఎలా మేనేజ్ చేయాలని గింజుకుంటున్నారు వైసీపీ నేతలు.
ఈ పరిస్ధితి వైసీపీవారికే కాదు.. గతంలో చంద్రబాబుకూ వచ్చింది. చంద్రబాబు సైతం కేంద్రంతో భేటీలకు వెళ్లడం వారు చెప్పేది విని మొహం మాడ్చుకోవడం.. బయటికి వచ్చిమాత్రం నవ్వు మొహం పెట్టి ఏదో చెప్పుకోవడం ఆయనకు అలవాటైపోయింది. పోలవరం ప్రాజెక్టులో నష్టపరిహారం బడ్జెట్ విషయంలో మొదటి నుంచి కేంద్రం దాగుడుమూతలాడుతూనే ఉంది. అయినా దానిని కొన్నాళ్లు దాచిపెట్టుకుని.. కప్పిపుచ్చుకుని కేంద్రాన్ని కన్విన్స్ చేయాలనే చూశారు చంద్రబాబునాయుడు.మరి దానిపై పోరాడాలని ఎందుకనుకోలేదో ఆయనకే తెలియాలి. కేంద్రం నుంచి డబ్బులు తీసుకోవాలంటే.. కేజ్రీవాల్ లాగానో.. మమతాబెనర్జీలాగానో.. జయలలితలాగానో ఫైట్ చేయాలి. ఎప్పుడూ వాళ్ల మీద ఆధారపడుతూ సన్నాయినొక్కులు నొక్కూతూ పోతే.. చివరికి మిగిలేది బూడిదే అన్న సత్యం మరి ఇప్పటికైనా చంద్రబాబుకి అర్ధమైందో లేదో తెలియదు మరి.
ఇక వైసీపీవారికి మాత్రం ఇప్పుడప్పుడే అర్ధమయ్యేటట్టు లేదు. అర్ధమైనా బయటకి ఎక్స్ ప్రెస్ చేయలేరు. చంద్రబాబు అన్నా నయం.. కనీసం తాను గెలవడం కోసం బిజెపితో గొడవ పెట్టుకున్నాడు. కాని పనవలేదు. జగన్ ఆ పని కూడా చేయగలిగేట్టు కనపడటం లేదు. ఎందుకంటే ఈయనకు ఎక్స్ ట్రా క్వాలిఫికేషన్ ఒకటుంది కాబట్టి. పోలవరం ప్రాజెక్టు మాత్రం కంప్లీట్ అయ్యే అవకాశాలు.. ఇప్పుడు ఇచ్చే బడ్జెట్ తో అయితే అయ్యే పని కాదని ఉండవల్లి అరుణ్ కుమార్ బల్లగుద్ది మరీ చెప్పారు. కాని వైసీపీ మంత్రులు, ముఖ్యమంత్రి మాత్రం డేట్లు ఇచ్చేస్తున్నారు. సామాన్యుడికి మాత్రం ఈ హైడ్రామా ఏమీ అర్ధం కావడం లేదు.