మోటర్లకు మీటర్లు పెట్టకుంటే..5 ఏళ్లలో 30 వేల కోట్లు ఎందుకు ఆపారని.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మంత్రి హరీష్ రావ్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్లకు వడ్లు కొనడం చేత కాదని, నూకలు బుక్కమని అంటున్నారంటూ మండిపడ్డారు. తాను సిద్దిపేటను అభివృద్ధి చేస్తుండడం చూసి..బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఈర్ ఇంకా ప్రజల దయతో ఆరోగ్య శాఖా మంత్రిని అయ్యానన్న హరీష్ రావ్..ఈ ఎనిమిదేళ్లలో బీపీ, షుగర్ వచ్చినా, తిరుగుళ్లకు టెన్షన్ పడుతున్నా.. రెండు పూటల మందులు వేసుకుంటూ తన బాధ్యతల్ని నిర్వరిస్తున్నామన్నారు. కాళేశ్వరం నీళ్లతో పెద్దవాగును నింపుతామని,ఫలితంగా ఎప్పటికీ వాగులో నీళ్లు ఉంటాయని, ఇసుక దొంగలకు ఇసుక దొరకదన్నారు.
కరోనా కారణంగా రైతుబంధు ఇవ్వలేమని తాము అనుకున్నామని..కానీ ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలు ఆపి మరీ రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ సర్కార్ దని.. మంత్రి హరీష్ రావ్ అన్నారు. ఇక బీజేపీ పై ధ్వజమెత్తిన ఆయన డబుల్ ఇంజన్ సర్కార్ లు ఉండి కూడా.. ఆయా రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయన్నారు. అక్కడ అభివృద్ది, సంక్షేమం ఎక్కడుందని ప్రశ్నించారు. తెలంగాణలో వైద్యారోగ్యం ఎంతో అభివృద్ది చెందిందని..డయాలసిస్ పేషంట్ల సమస్యల్ని కేసీఆర్ గుర్తించి, ప్రజలకు అందుబాటులో ఉండేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ధరణి పోర్టల్ గురించి తెలుసుకోకుండా కొంత మంది మూర్ఖులు ఏదేదో వాగుతున్నారని మండిప్డడారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.