బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ లో బాలయ్య గెటప్ అదిరిపోయింది. మోస్ట్ ఎగ్రెసివ్ లుక్ లో కనిపిస్తున్నాడు బాలయ్య. ఈ సంగతి పక్కనపెడితే, షూటింగ్ మొదలైన మూడో రోజుకే బాలయ్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. దీని వెనక చాలా పెద్ద కథ ఉంది.
మొన్ననే బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమా మొదలైంది. అయితే దురదృష్టవశాత్తూ షూటింగ్ మొదలైన మొదటి షెడ్యూల్ లోని మొదటి రోజే బాలయ్య గెటప్ బయటకొచ్చేసింది. యూనిట్ కు చెందిన వ్యక్తులే ఎవరో లొకేషన్ వీడియోను రిలీజ్ చేశారు. అక్కడితో వ్యవహారం ఆగిపోలేదు. మొదటి షెడ్యూల్ రెండో రోజు కూడా మరో వీడియో లీక్ అయింది. దీంతో చేసేదేం లేక షూటింగ్ మొదలైన మూడో రోజే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇంత హడావుడిగా ఫస్ట్ లుక్ విడుదల చేయడం వెనక అసలు కారణం ఇది.
బాలయ్య సినిమాలకు సంబంధించి ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈసారి మాత్రం లీకులే లీకులు. ఇలా జరగడం కూడా ఒకందుకు మంచిదే అయింది. అఖండ మేనియాలో ఉన్న నందమూరి అభిమానులు, కాస్త ముందుగానే కొత్త సినిమా ఫస్ట్ లుక్ అందుకున్నారు. పండగ చేసుకుంటున్నారు.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మరో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇదొక రీమేక్ సబ్జెక్ట్ అనే ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఒరిజినల్ స్టోరీతో బాలయ్య కొత్త సినిమా తెరకెక్కుతోందని ప్రకటించారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా కనిపించబోతున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.