సంక్రాంతికొచ్చిన ఒకే ఒక్క స్టార్ హీరో సినిమా బంగార్రాజు. సోలో రిలీజ్ అడ్వాంటేజ్ ను బంగార్రాజు బాగానే క్యాష్ చేసుకుంది. మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే ఇదంతా ఆంధ్రా వరకే. నైజాంలో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఇంకా చెప్పాలంటే నైజాంలో బంగార్రాజు ఫ్లాప్ అయింది. ఓ సినిమా ఆంధ్రాలో హిట్టయి, నైజాంలో ఫ్లాప్ అవ్వడం అనేది చాలా అరుదు. మరి బంగార్రాజు విషయంలో ఎందుకిలా జరిగింది?
దీనికి ట్రేడ్ నుంచి చాలా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందరూ కామన్ గా అంగీకరించే విశ్లేషణ ఒకటుంది. తన ఫ్యామిలీ హీరో ఆశిష్ కోసం దిల్ రాజు నైజాంలో ఎక్కువ థియేటర్లు అట్టిపెట్టుకున్నారట. ఈ మేరకు ఆయన ఏషియన్ సునీల్ తో కూడా ముందుగానే ఒప్పందం చేసుకోవడంతో బంగార్రాజుకు థియేటర్లు తగ్గిపోయాయనేది ఓ లాజిక్. మంచి సెంటర్లలో బంగార్రాజు పడక, మౌత్ టాక్ లేక సినిమా ఫ్లాప్ అయిందంటున్నారు కొంతమంది.
మరికొంతమంది ఆంధ్రా-తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తెస్తున్నారు. బంగార్రాజు సినిమా పూర్తిగా ఆంధ్రా నేటివిటీతో తెరకెక్కింది. ఇది తెలంగాణ ప్రేక్షకులకు నచ్చలేదనేది ఓ వాదన. పైగా ఆంధ్రాతో పోలిస్తే, తెలంగాణలో సంక్రాంతి ఫ్లేవర్ తక్కువ అనేది వీళ్ల లాజిక్. చెప్పుకోడానికి బాగున్నప్పటికీ ఇది సహేతుకమైన కారణం కాదు. ఎందుకంటే, ప్రతి ఏటా సంక్రాంతి సీజన్ కు నైజాంలో కూడా సినిమాలు బాగానే పెర్ఫార్మ్ చేశాయి. ఇక ఆంధ్రా యాస అనేది ఓ సాకు మాత్రమే.
మొత్తంగా చూసుకుంటే.. నైజాంలో బంగార్రాజు సినిమా ఆడలేదనేది మాత్రం వాస్తవం. సరైన సెంటర్లలో సినిమా పడకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేది ఎక్కువ మంది తేల్చిన విశ్లేషణ.