ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కు కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయి. ఏడాదిలో ఎన్నికలుండగా… దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో కనీస ప్రభావం చూపేందుకు ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కీలకమైన బ్రహ్మణ ఓటు బ్యాంకును కాంగ్రెస్ కు మళ్ళించే నేతలంతా ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.
కాంగ్రెస్ తో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉన్న రీటా బహుగుణ జోషి, జీతన్ ప్రసాద్ ఇప్పటికే బీజేపీ గూటికి చేరగా తాజాగా గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా ఉన్న లలిత్ త్రిపాఠి కూడా ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పటం యూపీ కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారింది. లలిత్ త్రిపాఠీ తాత కాంగ్రెస్ తరఫున యూపీ సీఎంగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. ఓవైపు యూపీలో పట్టు సాధించాలన్న కసి ఉన్నప్పటికీ కీలకమైన బ్రహ్మణ నేతలంతా పార్టీ వీడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
కాంగ్రెస్ ను ఆ నేతలు వీడేందుకు గల కారణాలను విశ్లేషిస్తే… కాంగ్రెస్ కు పట్టున్న బ్రహ్మణ వర్గాన్ని కాదని, ఇప్పుడు ఎస్పీ-బీఎస్పీలకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఓబీసీల వెంట పడుతుంది. ఇది సహజంగానే బ్రహ్మణ వర్గానికి రుచించదు. పైగా కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావటం… యోగి ఆదిత్యానాథ్ సీఎంగా ఉండటం కూడా ఓ కారణంగా కనపడుతుంది. దీంతో బ్రహ్మణ వర్గాన్ని పూర్తిగా బీజేపీ ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే కాంగ్రెస్ ఓబీసీల వెంట పడుతుండటంతో ఈ అవకాశాన్ని బీజేపీ పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటుంది. దీంతో బ్రహ్మణ వర్గంలో బలమైన కాంగ్రెస్ నేతలంత ఇప్పుడు ఒకరి వెంట ఒకరు బీజేపీ బాట పట్టారు.
రీటా బహుగుణ జోషి పార్టీ నుండి వెళ్లినప్పుడే కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష స్థానాన్నో సీఎం అభ్యర్థి పోస్టునో బ్రహ్మణులకు ప్రకటిస్తే పరిస్తితి వేరుగా ఉండేదని, కానీ ప్రియాంక గాంధీ పార్టీని ఎటు వైపు నడుపుతున్నారో ఎవరికీ అర్థం కావటం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.