ఆర్టీసి సమ్మె ప్రారంభంలో హడావిడి చేసిన బీజేపీ ఇప్పుడెందుకు సైలెంట్ అయింది?
మీడియా ముందుకు బీజేపీ నేతలు ఎందుకు రావట్లేదు?
ఆర్టీసి ప్రైవేటీకరణ కు బీజేపీ సై అంటోందా?
కార్మికులను ఉసిగొల్పి చోద్యం చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్.
ఆర్టీసి సమ్మె 52 రోజులుగా ఉదృతంగా సాగింది. కార్మిక కుటుంబాలు కడుపులు మాడ్చుకొని బతుకు పోరాటం చేశారు. ఇంత కాలం అన్నం పెట్టిన సంస్థను కాపాడుకోవడానికి రాజ్యం వంచే ప్రయత్నం చేశారు. మొదట్లో మీ వెనుక మేమున్నాం అంటూ మాట్లాడిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు అసలిప్పుడు పత్తా లేకుండా పోయారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనీసం మీడియా ముందుకు కూడా రావట్లేదు. ఒక్క కేంద్ర మంత్రి కూడా దీనిపై మాట్లాడింది లేదు. కార్మికులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. కార్మికులను ఒక రకంగా నడి రోడ్డుపై వదిలేసి ఇంట్లో పడుకున్నాయి బీజేపీ , కాంగ్రెస్.
బీజేపీ మౌనం వెనుక కారణాలు విశ్లేషిస్తే…కెసిఆర్ చేస్తున్న ఆర్టీసి ప్రైవేటీకరణ ను వ్యతిరేకించే పరిస్థితి లో బీజేపీ లేదు. ఎందుకంటే, కేంద్రం లో బీజేపీ చేస్తున్నది అదే కాబట్టి. ఇప్పటికే రైల్వే ల ప్రైవేటీకరణ విషయం లో ఒక నిర్ణయం తీసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా టెలికాం రంగంలో బిఎస్ఎన్ఎల్ ను మూసేసే చర్యలు చురుగ్గా సాగుతున్నాయి.దేశం లో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీ , కెసిఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి లో లేదు.
ఇక ఈ ప్రైవేటీకరణ కు పునాది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధిష్టానం కూడా ఆర్టీసి ప్రైవేటీకరణ ను వ్యతిరేకించదు.ఒకవేళ ఈ రెండు పార్టీలకు ఆర్టీసి కార్మికులను ఆదుకోవాలి అనే చిత్తశుద్ది ఉంటే సమ్మె ఫలితం వేరేలా ఉండేది.ఢిల్లీ వేదిక గా ఒక్క ఉద్యమం కూడా చేయకుండా చేతులు ముడుచుకొని , సినిమా చూస్తూ 50 వేల కుటుంబాలను నడి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత కెసిఆర్ తో పాటు, బీజేపీ కాంగ్రెస్ కు కూడా దక్కుతుంది.
తొలి వెలుగుతో మాట్లాడుతున్న బీజేపీ నాయకులది ఒకటే మాట. కేంద్రంలో బీజేపీ ఆర్టీసి సమ్మె ఏమీ చేయలేదు అని. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన విషయమని స్పష్టంగా చెబుతున్నారు. కేవలం ఆర్టీసి ప్రైవేటీకరణ జరిగిన తరువాత ఆర్టీసి ఆస్తులను ఎవరికి కట్టబెడుతున్నారు, పారదర్శకంగా జరుగుతుందా ? లేదా? అనేదే మా ముందున్న ప్రశ్న అంటున్నారు బీజేపీ నాయకులు. 48 వేల ఆర్టీసి కార్మికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూనే, ఆర్టీసి ప్రైవేటీకరణ మాత్రం మేము అడ్డుకునే పరిస్థితి లో లేమంటున్నారు.
బీజేపీ కాంగ్రెస్ మౌనం పై కార్మిక కుటుంబాలు మండిపడుతున్నాయి.