ఉన్నట్టుండి సడెన్ గా తెలంగాణలో బుక్ మై షోపై నిషేధం అమలైంది. మరీ ముఖ్యంగా భీమ్లానాయక్ అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వాల్సిన టైమ్ లో బుక్ మై షో నుంచి పవన్ సినిమాను తొలిగించారు. దీంతో ఒక్కసారిగా అంతా గందరగోళం నెలకొంది. టికెట్లు ఎలా తీసుకోవాలో తెలియక చాలామంది సతమతమౌతున్నారు.
ప్రేక్షకులపై బుక్ మై షో మోపుతున్న అదనపు భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని నైజాం ఎగ్జిబిటర్లు చెబుతున్నప్పటికీ.. తెరవెనక వ్యవహారం మరోలా ఉందనేది ఇన్ సైడ్ వర్గాల సమాచారం.
బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకుంటే, టికెట్ ధరతో పాటు అదనంగా మరికొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఆ కంపెనీ యూజర్ ఛార్జీలు, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జీలు లాంటి పేర్లు పెట్టుకుంది. అయితే ఇలా ఆర్జించిన మొత్తం నుంచి కూడా కొంత మొత్తాన్ని తిరిగి (అనధికారికంగా) థియేటర్లకు చెల్లిస్తుందట సదరు సంస్థ. ఇలా చెల్లిస్తున్న మొత్తాన్నే ఇంకాస్త పెంచాలని నైజాం ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ కారణంతోనే బుక్ మై షోపై నిషేధం విధించినట్టు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. నిర్దేశించిన ధర కాకుండా ప్రతి టికెట్ పై అదనంగా ఎగ్జిబిటర్ కు 10 రూపాయల చొప్పున చెల్లిస్తోందట బుక్ మై షో. ఇప్పుడీ మొత్తాన్ని 15 రూపాయలకు పెంచాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెరవెనక ఈ డిమాండ్ పెట్టి, పైకి మాత్రం ప్రేక్షకులపై పడుతున్న అదనపు భారం తగ్గించాలంటూ డైలాగ్స్ కొడుతున్నట్టు సమాచారం.