సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో బ్రహ్మానందానికి చాలా కీలకమైన పాత్ర. కామెడీ పండించడంతో పాటు, సినిమాలో పెద్ద ట్విస్ట్ బ్రహ్మానందం పాత్రతోనే వస్తుంది. మరి సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజులో బ్రహ్మానందం ఎందుకు లేరు? అంత కీలకమైన పాత్రను ఎందుకు తప్పించారు? దీనికి హీరో కమ్ నిర్మాత నాగార్జున వద్ద సాలిడ్ ఆన్సర్ ఉంది.
“ఇది తాత-మనవడు స్టోరీ. మధ్యలో 30 ఏళ్లు జరిగిపోయింది. కాబట్టి సోగ్గాడే చిన్ని నాయనాలో ఉన్న చాలా పాత్రలు మిస్ అయ్యాయి. ఇప్పుడు బంగార్రాజులో బ్రహ్మానందం పాత్రను చూపిస్తే వర్కవుట్ అవ్వదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బ్రహ్మానందాన్ని చూపించాల్సి వస్తే, ఆయనను 85 ఏళ్ల వ్యక్తిగా చూపించాలి. మళ్లీ అదో పెద్ద పని. అందుకనే బ్రహ్మానందం పాత్రను తప్పించాం. బ్రహ్మానందాన్ని మాత్రమే కాదు, కీలకమైన అనసూయ లాంటి పాత్రల్ని కూడా అందుకే తీసేశాం.”
ఇలా బ్రహ్మానందం పాత్రను తొలిగించడం వెనక అసలు కారణాన్ని బయటపెట్టాడు నాగార్జున. అంతేకాదు, ఈ సందర్భంగా మరో కీలక విషయాన్ని కూడా బయటపెట్టాడు. సినిమా కథ కోసం ఏకంగా తను నటించిన రాము పాత్రనే పక్కనపెట్టిన విషయాన్ని గుర్తుచేశాడు. రాము పాత్ర విదేశాలకు వెళ్లిపోతుందని, క్లైమాక్స్ లో మాత్రమే వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు రాము వైఫ్ గా నటించిన లావణ్య త్రిపాఠి పాత్రను కూడా తప్పించిన విషయాన్ని గుర్తుచేశాడు.
సంక్రాంతి కానుకగా విడుదలైంది బంగార్రాజు సినిమా. ఏపీలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల బాట పట్టింది. నైజాంలో మాత్రం సినిమా ఫ్లాప్ అయింది. అయితే ఓవరాల్ గా సినిమా ప్రాఫిట్ వెంచర్ అనిపించుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాను జీ ప్లెక్స్ లో పే పర్ వ్యూ (డబ్బులు చెల్లించి చూసే విధానం) మోడల్ కింద విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు జీ5లో నేరుగా స్ట్రీమింగ్ కు పెడతారు.