– బీఆర్ఎస్ బహిరంగ సభ ఖమ్మంలోనే ఎందుకు?
– అక్కడ సభ పెడితే దేశమంతా మాట్లాడుకుంటుందా?
– గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటే సాధించిన బీఆర్ఎస్
– ఆపరేషన్ ఆకర్ష్ తో కారు ఓవర్ లోడ్
– అధిష్టానంపై అసంతృప్తితో కొందరు నేతలు
– అనుమానాస్పదంగా పొంగులేటి, తుమ్మల చర్యలు
– కేసీఆర్ సభ రోజే పొంగులేటి, అమిత్ షా భేటీ?
– 18న ఏం జరగబోతోంది..?
రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది బీఆర్ఎస్ పరిస్థితి. ముందుగా పార్టీ పేరు మార్పు కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారిన వెంటనే ఢిల్లీ గల్లీలో గర్జిస్తామని గులాబీ నేతలు మీడియా ముందు తెగ ఊదరగొట్టారు. కానీ, ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. అయితే.. దేశాన్ని ఏలుతున్న బీజేపీని గద్దె దించుతామని చెబుతూ.. ఇప్పుడు ఖమ్మం గుప్పంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 18న ఖమ్మం జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
జాతీయ నేతలకు ఆహ్వానం
ఈ సభకు ముగ్గురు ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు. వారిలో ఇద్దరు ఆప్ సీఎంలు కేజ్రీవాల్ , భగవంత్ మాన్ ఉన్నారు. మరొకరు లెఫ్ట్ పార్టీ సీఎం విజయన్. ఇక యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కు కూడా ఆహ్వానం పంపారు. ఈ సభ ద్వారా దేశ రైతాంగానికి, రాజకీయ పక్షాలకు స్పష్టమైన సందేశం ఇస్తామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. జాతీయ పార్టీ సభను తెలంగాణలో పెట్టి.. ప్రచారం చేసుకుంటే ఎంతవరకు ఉపయోగం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఎంత భారీ సభ పెట్టినా ఇక్కడికే పరిమితం. ఇతర రాష్ట్రాల నేతలు వచ్చినా.. జాతీయ స్థాయిలో ప్రచారం జరగడం కష్టమేనంటున్నారు విశ్లేషకులు. అదే ఢిల్లీలోనే, యూపీలోనో భారీ సభ పెడితే అందరి కంట్లో పడే ఛాన్స్ ఉంటుందని సూచిస్తున్నారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ కు అంత సీన్ ఉందా..?
నిజానికి విశ్లేషకుల వాదనలో నిజం లేకపోలేదు. ఢిల్లీ గల్లీలో జరగాల్సిన సభను ఖమ్మం గుప్పంలో జరపడమే అనేక అనుమానాలకు తావిస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే.. కేవలం ఒక్క ఖమ్మం అసెంబ్లీ మాత్రమే తక్కువ మెజారిటీతో టీఆర్ఎస్ గెలిచింది. మిగిలిన 9 చోట్ల ఓడిపోయింది. కాంగ్రెస్ 6, టీడీపీ 2, ఇండిపెండెంట్ ఒకటి గెలుచుకున్నారు. అయితే.. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నలుగురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని కేసీఆర్ లాగేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కు 8, కాంగ్రెస్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలవాలని గులాబీ నేతలు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ, అది కుదిరే పని కాదనే చర్చ సాగుతోంది.
పొంగులేటితో ప్రమాదమే..!
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు అంతగా పట్టు లేదు. ఇప్పుడు వామపక్షాలతో జట్టు కట్టినా.. అంతర్గత కుమ్ములాటలు నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ తో పార్టీలోకి వచ్చిన నేతలు, అంతకుముందు ఉన్న నాయకులకు పడడం లేదు. పైగా కొందరు నేతలు పదవులకు ఆశపడి భంగపడ్డారు. అలాంటి నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినే తీసుకుంటే. 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు పొంగులేటి. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు. బీజేపీకి కూడా టచ్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ ఖమ్మంలో సభ నిర్వహిస్తున్న రోజే.. పొంగులేటి అమిత్ షాతో భేటీ కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఇటీవలికాలంలో పొంగులేటి చేస్తున్న వరుస కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని, అలాగే తనకు పదవులు లేకున్నా ప్రజల ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధం అయ్యారని అందులో భాగంగానే తన అనుచరులను సిద్ధం చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
తుమ్మలది అదే దారి..!
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్యలు కూడా అనుమానంగా ఉన్నాయి. ఈయన చాలాకాలంగా అధిష్టానంతో అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అదును చూసి జంప్ అవ్వాలని చూస్తున్నారనే ప్రచారం ఉంది. 2009 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. 2014లో టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2016లో పాలేరు ఉపఎన్నికలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితపై గెలిచారు. కానీ, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే.. ఇటీవల ఈయన కూడా తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పొంగులేటి పొలిటికల్ గా బిగ్ డిసిషన్ తీసుకుంటే అదే బాటలో తుమ్మల కూడా పయనిస్తారా? అనే దానిపై జిల్లాలో చర్చ సాగుతోంది. 18న కేసీఆర్ టూర్ సందర్భంగా ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠను రేపుతోంది.
ఖమ్మంలో బీఆర్ఎస్ సభ అందుకేనా?
పొంగులేటి, తుమ్మల చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఈమధ్యే టీడీపీ, వైటీపీ ఖమ్మం జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించాయి. ఆ రెండు పార్టీలకు బలమైన క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో అన్నింటికీ చెక్ పెట్టేందుకు.. ఈసారి క్లీన్ స్వీప్ చేసేందుకే కేసీఆర్ ఖమ్మంపై ఫోకస్ పెట్టారని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి.. బీఆర్ఎస్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అనేది చూడాలి.