దేశ తదుపరి ప్రధాన మంత్రి స్టాలిన్ ఎందుకు కాకూడదని ప్రశ్నించారు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా..2024 సార్వత్రిక ఎన్నికల ముందు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకె. స్టాలిన్ ని దేశ ప్రధానిగా తాను చూడాలనుకుంటున్నానని ఆయన అన్నారు. స్టాలిన్ 70 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బుధవారం చెన్నైలో జరిగిన కార్యక్రమానికి విపక్షాల్లో మెజారిటీ నేతలు హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల ముందు స్టాలిన్ ని జాతీయ నేతగా పరిగణించి విపక్షాల్లో ఐక్యతను తేవాలని డీఎంకే భావిస్తోంది. అందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది.
‘మేమంతా సమైక్యంగా ఉండి ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ఈ దేశానికి నాయకత్వం ఎవరు వహిస్తారన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని, ఆ బెస్ట్ మ్యాన్ స్టాలిన్ ఎందుకు కాకూడదని’ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ కూడా అయిన ఫరూక్ అబ్దుల్లా.. మీడియాతో వ్యాఖ్యానించారు. అంటే విపక్షాల నుంచి పీఎం అభ్యర్థిగా స్టాలిన్ ఉండాలని తాము కోరుతున్నామన్నారు. ప్రధాని కాగల అర్హతలన్నీ ఆయనలో ఉన్నాయన్నారు. ఇక తమ నేత జన్మదిన వేడుకలు కేవలం తమిళనాడుకే పరిమితం కాదని, మొత్తం దేశానికంతటికీ ముఖ్యమైన ఈవెంట్ అని రాష్ట్ర మంత్రి, డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయవచ్చునని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శత్రుఘన్ సిన్హా ఇటీవల పేర్కొన్నారు. ఇక గేమ్ ఛేంజర్ గా ఇదే పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేరు కూడా ప్రముఖంగా వినవస్తోంది.