హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనపై తెలంగాణ కన్నా ముందే స్పందించి దిశ చట్టం చేసింది ఏపీ సర్కార్. ఇంతవరకు బాగానే ఉన్నా… ఈ దేశంలో చట్టాలకు కొదువ లేదు, అవి ఎంతవరకు అమలవుతాయనే వాటిపైనే నేతల చిత్తశుద్ధి ఆధారపడి ఉంటుందన్న మేధావుల మాటలు ఏపీ సర్కార్‌కు అచ్చంగా సరిపోతున్నాయి. ఎంతో హాడావిడి చేసి, మహిళల జోలికి వెళ్తే తాట తీస్తామంటూ సీఎం జగన్ తెచ్చిన కొత్త చట్టం దిశా చట్టం.
చట్టం చేశారు… అన్న పేరే కానీ చట్టం వచ్చిన తర్వాత ఏపీలో మహిళపై ఆఘాయిత్యాలు ఆగాయా…? అసెంబ్లీలో మహిళలపై వక్ర బుద్దితో చూడాలంటే భయపడాలి అని గొప్పలు చెప్పిన నేతల హమీలు ఆచరణలో ఉన్నాయా….? అంతేందుకు దిశ చట్టమైన కోర్టుల్లో నిలిచేలా చేశారా…? అంటే అన్ని ప్రశ్నలకు లేదనే సమాధానమే వస్తోంది.
దిశ చట్టం చేసిన ఏపీ సర్కార్… కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. కానీ ఆ చట్టంలో అనేక లోటుపాట్లున్నాయంటూ కేంద్రం ఆ చట్టాన్ని తిప్పి పంపింది. ఇలాంటి సమయంలో… సీఎం జగన్ దిశ పోలీస్ స్టేషన్ల పేరుతో మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 18 స్టేషన్లు ఏర్పాటు చేశారు.
మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలు అమలుకాకపోవటంతోనే అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నది వాస్తవం. పోలీస్ యంత్రాంగం, విద్యాశాఖ ప్రజల్లో చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు శిక్షిస్తారు అన్న భయం వచ్చేలా కార్యచరణ రూపోందించాలి. అంతేకానీ అధికారులతో సమీక్షలు, హాడావిడిగా హంగు-ఆర్భాటాలతో ఓపెనింగ్‌లతో సమస్యకు పరిష్కారం అయ్యేది లేదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా… క్షత్రస్థాయిలో తప్పు చేసిన వారిని పోలీస్‌లు పట్టుకునేలా వ్యవస్థ మారితే దిశ చట్టానికి విలువ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.