రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం పట్టింపులకు పోతుందా…? కార్మికులపై కేసీఆర్ సర్కార్ ఎందుకంత నిర్ధాక్షిణ్యంగా మాట్లాడుతోంది…? కేసీఆర్ అప్పట్లాగే ఇప్పుడూ వ్యవహరిస్తే అదే ఫలితం వస్తుందా…? అసలు కేసీఆర్ మదిలో ఏముంది…?
రాష్ట్రంలో ఏ సమ్మె జరిగినా… కేసీఆర్ ఉక్కుపాదంతో అణిచివేశారు. మేము చెప్పినట్లు వినాల్సిందే లేదంటే… మీ ఇష్టం అన్నట్లు వ్యవహారించారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినప్పుడు కార్మికులపై ప్రభుత్వం కక్షపూరితంగానే వ్యవహరించింది. వస్తే ఉద్యోగంలోకి రండి లేదంటే ఉద్యోగం పోతుందని స్పష్టం చేశారు. కొంతమంది కార్మికులు ప్రభుత్వ బెదిరింపులకు లొంగలేదు. దాంతో… చివరి వరకు వారిని ఇబ్బందిపెట్టారు కేసీఆర్. చాలా కాలం తర్వాత మళ్లీ వారిని తిరిగి తీసుకున్నారు.
గతంలో ఆర్టీసీ సమ్మె చేసిన కాలంలో కూడా మొదట్లో కేసీఆర్ కఠినంగా ఉన్నా… ఆర్టీసీ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కొంతకాలం సమ్మెను ప్రొలాంగ్ చేయించి, వారికి ఫిట్‌మెంట్ ఇచ్చారని అప్పట్లో చర్చ జరిగింది. అనుకున్నట్లే టీఆర్ఎస్ పార్టీ అనుబంధ యూనియన్ గెలుపొందింది.
అయితే, ఈసారి ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సర్కార్ గుర్రుగా ఉంది. నేను చెప్పినా… వినటం లేదా అన్న ఆగ్రహాం కనపడుతోందంటున్నారు కార్మికులు. అయితే… కేసీఆర్ ఈసారి గతంలో మున్సిపల్ ఉద్యోగులపై ప్రయోగించిన ఆస్త్రాన్నే ప్రయోగించే యోచనలో ఉన్నట్లు కనపడుతోంది. అందుకే సాయంత్రం ఆరు గంటల వరకు డెడ్‌లైన్ పెట్టి… ఆ టైం వరకు అందరూ విధుల్లోకి రండి. లేదంటే ఎస్మా ప్రయోగించేస్తాం అని బెదిరిస్తున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
అయితే, కేసీఆర్ బెదిరింపులకు భయపడబోమని కార్మిక సంఘాలంటున్నారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహం మా దగ్గర పనిచేయదని… ఇక్కడ తెలంగాణలో ప్రతిడిపోలో కార్మికులు సమ్మెలోనే ఉన్నారని, డిపో మేనేజర్లు మినహా అంతా సమ్మెలో ఉండగా కేసీఆర్ ఏమీ చేయలేరని స్పష్టం చేస్తున్నారు. పిడికెడు మందిని బెదిరించొచ్చు, కానీ ఇక్కడ వ్యవస్థనే సమ్మెలో ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులే గతంలో ఆంద్రా ప్రభుత్వాలు చేసినా భయపడలేదని, ఇప్పుడు ఉద్యమ నాయకుడైన కేసీఆర్ ఉద్యమాలను అణచివేస్తామనటం హస్యాస్పదం అంటూ మండిపడుతున్నారు కార్మికులు.