తెలంగాణలో ఉపాధ్యాయుల పట్ల సీఎం కేసీఆర్ ఎందుకు వివక్ష చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు పిలిచి ఉపాధ్యాయులను మాత్రం చర్చలకు ఆహ్వానించకపోవడానికి గల కారణం ఏంటో చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు.
ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయులకు ఎన్నికల బాధ్యతలు ఇవ్వకుండా దూరం పెట్టారని, దీన్ని బట్టి వారి పట్ల కేసీఆర్ చూపిస్తున్న వివక్ష బట్టబయలైందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లు దాటినా ఉద్యోగులకు ఎందుకు పీఆర్‌సీ అమలు చెయ్యడం లేదని ప్రశ్నించారు. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపు చర్యలు చేపట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు.