దేశంలో రైతులు మరీ రాజకీయ నాయకుల్లా మారిపోయారు. కలలో కూడా ప్రజా సంక్షేమాన్ని మాత్రమే కాంక్షించే ప్రభుత్వం పట్ల.. ఫక్తు ప్రతిపక్ష నేతల్లా ప్రవర్తిస్తున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ఇండియాను ప్రపంచమే పొగుడుతూ ఉంటే.. ఈ రైతులేమో అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఎంతో మంది మహానుభావులు, రాత్రీ, పగలూ పార్లమెంట్‌లోనే కూర్చొని, బుర్రలు బద్దలు కొట్టుకొని దేశ క్షేమం, రైతు సంక్షేమం కోసం.. ఏరి కోరి, ఎంతో శ్రమించి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే.. వాటిిిని వద్దు అని చెప్పడానికి ఈ రైతులకు ఎంత అహంకారం? తెల్లవారితే పొలం.. రాత్రయిందంటే ఇళ్లు తప్ప మరో విషయం తెలియనివారు.. ఢిల్లీ పెద్దలు చేసిన చట్టాలను ధిక్కరించడమా?అది కూడా ఏ పార్టీ మద్దతు లేకున్నా.. భారత్ బంద్‌కు పిలుపునిచ్చేంత ధైర్యమా?
అసలు తప్పేముంది ఆ చట్టాల్లో. ప్రతిపక్షాలను మించిన ఓవరాక్షన్ రైతులు ఎందుకు చేస్తున్నారు?ఇప్పుడు ప్రతీ పౌరుడు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం, సమయం ఇది.
మొదటి చట్టంలో… పంట, ధాన్యం నిల్వలపై పరిమితిని పూర్తిగా ఎత్తివేసింది కేంద్రం. అంటే ఎవరైనా, ఎంతైనా ఎన్న రోజులైనా, ఏ పంటనైనా నిల్వ చేసుకోవచ్చు. అంతటి మంచి అవకాశాన్ని ఇస్తే.. రైతులు మాత్రం దాన్ని తప్పు అంటున్నారు. తమ పంటలను నెలల తరబడి దాచుకునేందుకు వారికి ఎలాగూ తమ ఇళ్లల్లో పెద్ద పెద్ద గదులు ఉండవు. కానీ కార్పొరేట్ కంపెనీలకు చెందిన వ్యాపారులేం పాపం చేశారు? వాళ్లు దాచుకుంటారు కదా! పంటలకు డిమాండ్ ఉన్నప్పుడే అమ్ముకునే సౌకర్యాలు రైతులకు ఎలాగూ లేవు. అలా అమ్ముకునే తెలివి కూడా వారికి లేదు. కానీ ఎంతో మంది వ్యాపారులు పెద్ద మనసుతో తాము నష్టపోయినా సరే..ఎంతో, కొంతకు రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తుంటారు. కనీసం వాళ్లయినా లాభానికి అమ్ముకోవాలి కదా.. పంటకు భారీ రేటు వచ్చేదాకా దాచుకొని.. అమ్ముకునేందుకు వాళ్ల కోసం చట్టాన్ని తీసుకొస్తే.. రైతులు దాన్ని వ్యతిరేకించడం దుర్మార్గం కాకపోతే మరేంటి? ఇంకా నయం చట్టం ఎలాగు చేశారు కదా..తమ కోసం ప్రతి ఊరిలో గోడౌన్లు నిర్మించమని అడగలేదు!
ఇక రెండోది ఇంకా అత్యద్భుతమైన చట్టం.. రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటోంది కేంద్రం. కానీ రైతులు దాన్ని కూడా మోసం అంటున్నారు. దేశంలో మీ పంటకు ఎక్కడ ఎక్కువ రేటు పలికితే అక్కడికి వెళ్లి అమ్ముకోండని బంపర్ ఆఫర్ ఇస్తే.. రైతులు ఈ చట్టాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా అజ్ఞానుల్లా మాట్లాడుతున్నారు. లోకల్ మార్కెట్ దాటడం చేతగాక.. తామున్న ప్రాంతలోనే మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలులో పండిన టమాటాను.. కరీంనగర్‌కు లారీలో తీసుకెళ్లే తెలివి కూడా లేదా.. డీజిల్ కోసం పదివేల రూపాయలు ఖర్చు పెడితే .. కనీసం రెండు వేల రూపాయలైనా లాభం వస్తుంది కదా.. కానీ ఈ అవివేక రైతులు ఎలాగు అలా చేయరు. ఎందుకంటే వారు పెద్ద పిసినారీలు. రైతులు ఎలాగు దేశంలో ఏ మార్కెట్‌కు పడితే ఆ మార్కెట్ వరకూ రారు. అందుకే వ్యాపారులు, కంపెనీలే ఎక్కడ తక్కువ ధరకు పంటలు దొరుకుతాయో అక్కడికి వెళ్లి ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పి కొంటాయి. ఆ తర్వాత తీరిగ్గా.. పంట రేటు పెరిగినప్పుడో, లేక ఎక్కువ రేటు ఉన్న ప్రాంతానికో వెళ్లి అమ్ముకొని వాళ్ల కుటుంబాలను పోషించుకుంటాయి. రైతు కోసం అంత త్యాగం చేస్తున్న కంపెనీలు కాలం కాలం హాయిగా బతకాలని కోరుకోవడమే ప్రభుత్వం చేస్తున్న తప్పా?
ఇక మూడో చట్టం..కాంట్రాక్ట్ ఫార్మింగ్. అంటే రైతులతో తమకిష్టమైన పంట వేయించుకొని.. వాటికి ముందుగానే కంపెనీలు ఒక రేట్ ఫిక్స్ చేస్తాయన్నమాట. ఒకవేళ పంటి చేతికొచ్చే సమయంలో మార్కెట్‌లో దాని ధర ఎక్కువ ఉన్నా.. మాట తప్పకుండా అగ్రిమెంట్‌లో ఉన్న ప్రకారమే చెల్లిస్తాయన్నట్టు. ఎందుకంటే ఒకవేళ రేటు తక్కువ ఉంటే కంపెనీ నష్టపోతుంది కదా. రైతులు నష్టపోతే పరవాలేదు కానీ.. కంపెనీ నష్టపోతే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? దేశంలో రైతులు కోట్లాది మంది ఉన్నారు.. వాళ్లు చచ్చినా పరవాలేదు కానీ.. కంపెనీలు పదుల సంఖ్యలోనే ఉంటాయి… అవి ఎప్పటికీ బతకాలి. అందుకే తమ అగ్రిమెంట్‌తో ఐదేళ్ల తర్వాత ఎంత రేటు ఇవ్వాలో కూడా మొదటి ఏడాదే కంపెనీలు నిర్ణయిస్తాన్నమాట. ఇందులో రైతులు నష్టపోయేది ఏముంది? పాపం కంపెనీలే తీవ్రంగా నష్టపోతాయి. భవిష్యత్తులో ఏ పంటకు ధర ఉంటుందో, ఏ పంటకు ధర ఉండదో తెలియకపోయినా.. పెద్ద మనసుతో రైతుకు ఎంతో కొంత ఇచ్చేందుకు ముందుకు వస్తుంటాయి. కానీ రైతులు ఈ చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు.
రైతులకు ఇంత మేలు చేస్తున్న కార్పొరేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు… సాధారణ ప్రజలకి మాత్రం ఎందుకు నష్టం చేస్తాయి? వారి లక్ష్యమే దేశ ప్రజలకు సేవడం చేయడం కదా. రైతులకు ఎలాగూ ఈ చట్టాల గురించి అర్థం కాలేదు. అందుకే భారత్ బంద్ అంటూ ఓ పిచ్చి నిరసన చేస్తున్నారు. కనీసం సగటు భారతీయుడిగా వాళ్లు చేసేది తప్పు అని గట్టిగా నినదించి.. దేశం కోసం సర్వస్వాన్ని ధారపోస్తున్న కార్పొరేట్ కంపెనీలను బతికించడం మన బాధ్యత. కర్తవ్యం. అందుకే గట్టిగా నినాదిద్దాం.. జై జై ఎన్డీయే.. డౌన్ డౌన్ ఫార్మర్!