ఆడపిల్లలకు చేసే ముఖ్యమైన ఫంక్షన్స్ లో రజస్వల ఫంక్షన్ ఒకటి. ఇందుకోసం లక్షలు అప్పు చేసి మరీ చేసే వాళ్ళు ఉన్నారు. ఏదీ లేక ఇంట్లో భోజనం పెట్టె వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయి ఎచ్చులకు పోయి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు కొందరు. ఈ ఫంక్షన్ ముఖ్య ఉద్దేశం తెలియకుండానే చాలా మంది హడావుడి చేస్తూ ఉంటారు.
అసలు రజస్వల ఫంక్షన్ ను ఎందుకు చేస్తారు ఏంటీ అనేది చూద్దాం. అమ్మాయి పదిమందికీ పరిచయం అవుతుందని, దీనివల్ల ఎవరికైనా నచ్చితే, సంబంధానికి సుముఖులవుతారని భావించి ఆడపిల్లల పెళ్లి సంబంధాల కోసం చెప్పులు అరిగేలా తిరిగే రోజుల్లో ఘనంగా నిర్వహించే వారు. అప్పట్లో అమ్మాయి రజస్వల కాకుండానే వివాహం చేయడంతో ప్రాణాలు కూడా పోయేవి. రజస్వల అయ్యాకా చేయడం అనేది ఆనవాయితీగా మారింది.
మా ఇంట్లో ఆడపిల్ల పెళ్ళికి రెడీ గా ఉంది అని చెప్తూ పెద్దల దీవెనల కోసం ఈ కార్యక్రమం చేసే వారు. ఈ నవకన్యను అందరూ ఇంటా బయటా ఓకంట కనిపెట్టి ఉంటారని ఫంక్షన్ కాస్త ఘనంగా చేసే వారు. అయితే ఇప్పుడు ఇది ఒక పిచ్చిగా మారింది. ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకోవడానికి, మంచి చెడులు చెప్పడానికి పెద్దలకు పరిచయం చేసే కార్యక్రమం అయితే లక్షలు పెట్టి ఫంక్షన్ చేసి రోడ్డున పడి… అమ్మాయి పుట్టడం శాపం అని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు.