భారతీయ దర్శకుల్లో మర్చిపోలేని దర్శకుడు కే విశ్వనాథ్. 50 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన దాదాపు విజయాలే అందుకున్నారు. టాలీవుడ్ లో ఒకప్పుడు ఆయనకు ఉన్న డిమాండ్ ఎవరికి లేదు అంటారు. ఆయన దర్శకత్వంలో ఒక సినిమా అయినా చేయాలని బాలీవుడ్ హీరోలు సైతం ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయంటారు. నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు రెండేళ్ళ ముందే అడ్వాన్స్ లు ఇచ్చేవారు.
కళలు, సాంప్రదాయాలకు ఆయన సినిమాల్లో పెద్ద పీట వేసేవారు. ఆయన సినిమాల్లో పాటలు బాగా హిట్ అయ్యేవి. పాటల చిత్రీకరణ విషయంలో విదేశాలకు వెళ్లి హడావుడి చేయకుండా మన తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. సినిమా షూటింగ్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా చేసేవారు. సినిమాల బడ్జెట్ కూడా నిర్మాతలకు అనవసర భారం పడకుండా చూసేవారు ఆయన.
ఇక ఆయన సినిమా షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే వారు. మేకప్ విషయంలో ఆలస్యం అయినా సరే తాను అనుకున్న విధంగా లుక్ వచ్చే వరకు ఎదురు చూసేవారు. ఇక ఆయన షూటింగ్ సమయంలో ఖాకీ వస్త్రాలు ధరించేవారు. ఇది అప్పట్లో ఒక సంచలనం అనే చెప్పాలి. దీని వెనుక అసలు కారణం వివరించారు. దర్శకత్వం అనేది ఓ బాధ్యత అని ఓ విధి అంటారు కళా తపస్వి. ఓ ఉద్యోగం లాంటిది అందుకే దాన్ని విధిగా ఆచరించాలనే ఉద్దేశంతోనే అలా యూనిఫామ్ లో కనిపిస్తానని తెలిపారు.