ఈ రోజుల్లో దాదాపుగా అందరూ… గ్యాస్ మీదనే వంట చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో మాదిరిగా వంట పాత్రలకు మసి అంటుకునే బాధ తప్పుతుంది. ఇసుక, బూడిద, కొబ్బరి పీచు పెట్టి రుద్దే కష్టాలు లేవు అనే చెప్పాలి. అది ఓకే గాని అసలు గ్యాస్ మీద వండితే మసి ఎందుకు పాత్రలకు అంటుకోదు అనేది చాలా మందికి అవగాహన లేదు కదూ… అదేంటో ఒకసారి చూద్దాం.
Also Read:మన ఊరు-మన బడి టెండర్ పై విచారణ!
కర్బనం ఉన్న వస్తువులు అసంపూర్ణంగా మండినప్పుడు దానిలో ఉండే కర్బనం మసి రూపంలో పాత్రలకి అంటుకోవడం జరుగుతుంది. కర్బనం అంటే బొగ్గు శాస్త్రీయ నామం. కర్బనం ఉండే వస్తువుల జాబితాలో కర్రలు, బొగ్గులు, వంట వాయువులు, పెట్రోలు, డిసెల్, వగైరా ఇంధనాలు ఉంటాయి. వీటిల్లో దేన్ని మండించినా వాట్లిలోని కర్బనం పూర్తిగా మండకపోతే మిగిలినది మసి రూపంలో గిన్నెలకి, వంటగది గోడలకి, మన బట్టలకి అంటుకోవడం జరుగుతుంది.
పొయ్యిలో కట్టెలతో వంట చేసినప్పుడు ఆ కట్టెలు అసంపూర్ణంగానే దహనం కావడం జరుగుతుంది. మంట లేత నీలం రంగులో ఉంటే మాత్రమే ఇంధనం సంపూర్ణంగా దహనం అయినట్లు గుర్తు. మంట పచ్చగా ఉంటే మాత్రం అవి పూర్తిగా కాలడం లేదు. కట్టెల పొయ్యిలోని మంటలో నీలం కనపడే అవకాశం లేదు కాబట్టి ఎక్కువ మసి వస్తుంది. అయితే గ్యాస్ మీద మంట పూర్తిగా ఉంటుంది కాబట్టి దాదాపుగా మసి అంటుకోదు. అయితే కొన్ని సందర్భాల్లో గ్యాస్ మీద కూడా మసి అంటుకుంటుంది. అప్పుడు మంటకీ, గిన్నెకీ మధ్య జల్లెడ లాంటిది పెట్టాలి. ఇక గిన్నెకి అడుగున సబ్బు రాసినా సరే మసి బాధ తప్పుతుంది.
Also Read:మాజీ సీఐ నాగేశ్వరరావు కస్టడీ కోసం కోర్టులో పిటిషన్