ట్రిపుల్ తలాక్ విధానం సరైనదేనని కేరళ సీఎం పినరయి విజయన్ సమర్థించారు. విడాకుల కేసులను ఇతర మతాల కన్నింటికీ సివిల్ కేసులుగా పరిగణిస్తున్నప్పుడు ఒక్క ముస్లిములకు సంబంధించి మాత్రమే దీన్ని నేరంగా ఎందుకు చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ ని కేంద్రం ‘క్రిమినలైజ్’ చేస్తోందని ఆయన ఆరోపించారు. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దీనికి వివిధ మతాలకు చెందినవారు హాజరయ్యారని, వీరిలో ప్రతి ఒక్కరికీ వేర్వేరు శిక్ష విధించగలమా అని అన్నారు.
ఒకవ్యక్తి ఒక మతానికి చెందినప్పుడు అతనికి ఒక చట్టం, మరొకరికి మరో చట్టాన్ని ఎలా వర్తింపజేయగలమన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో మనం ఇదే చూస్తున్నామన్నారు. అన్ని మతాల్లోనూ విడాకులన్నవి ఉంటాయని ఆయన చెప్పారు.
ట్రిపుల్ తలాక్ చెప్పిన ముస్లిమును జైలుకు పంపుతున్నారని, కానీ మనమంతా భారతీయులమని.. ప్రత్యేకంగా ఒక మతంలో పుట్టినందున మనకు పౌరసత్వం లభించిందని ఎలా చెప్పగలుగుతామన్నారు.
పౌరసత్వానికి మతం ప్రాతిపదిక అవుతుందా అని కూడా విజయన్ ప్రశ్నించారు. ఓ సవరణ చట్టం ద్వారా కేంద్రం పౌరసత్వాన్ని నిర్ణయించడానికి మతాన్ని వాడుకొంటున్నదని ఆయన విమర్శించారు. తమ రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు