ఒక న్యాయమూర్తి సర్వీస్ లో మరణ శిక్ష విధించడం అనేది సవాల్ తో కూడుకున్న పనిగా చెప్పాలి. ఒక వ్యక్తి ప్రాణం తీయమని ఆదేశించాలి అంటే న్యాయమూర్తికి మానసిక బలం ఉండాలి. ఇక మరణశిక్ష విధించిన తర్వాత, న్యాయమూర్తులు పెన్ నిబ్ ను విరగకొడతారు. ఆ విధంగా ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి అవగాహన లేదు. అలా నిబ్‌ను విచ్ఛిన్నం చేయాలి అనేది రూల్ కాదు. కేవలం అదొక సంప్రదాయం.
దీనిని ప్రతీకాత్మక చర్యగా చెప్తారు న్యాయ నిపుణులు. ఐపీసి, సిఆర్పీసీ చట్టాలలో మరణశిక్ష విధించిన తర్వాత న్యాయమూర్తి పెన్నును పగలగొట్టాలని ఎక్కడా ప్రస్తావించలేదు. మరణ శిక్ష విధించిన తర్వాత నిబ్ పగలగొట్టే ఆచారం బ్రిటిష్ పాలన నుండి మన దేశ న్యాయమూర్తులు అనుసరిస్తున్నారు. అసలు దాని వెనుక ఉన్న కారణాలు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి సంతకం చేసిన తర్వాత, తీర్పును సమీక్షించే లేదా రద్దు చేసే అధికారం న్యాయమూర్తులకు లేదు. కాబట్టి న్యాయమూర్తి తన స్వంత తీర్పును సమీక్షించుకోవాలనే ఆలోచన లేకుండా ఉండటానికి నిబ్ విరగగొట్టబడుతుంది.
ఆ పెన్, ఒక వ్యక్తి జీవితానికి ముగింపు పలుకుతుంది. అలాంటి దురదృష్టకరమైన కలాన్ని మరోసారి వాడకూడదు అనే ఉద్దేశం దీని వెనక ఉంది. రక్తం రుచి చూసిన పెన్నుగా పరిగణించి, మరో ప్రాణం తీయటానికి ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తారు. ఒకరకంగా చెప్పాలి అంటే… మరణశిక్ష విధించడం అనేది కష్టతరమైన తీర్పు. ఆ తీర్పుతో అసంతృప్తి గానీ, పశ్చాత్తాపం గానీ కలగకూడదనే భావన న్యాయమూర్తికి కలిగే విధంగా ఈ ఆచారాన్ని అలా కొనసాగిస్తున్నారు.