వేసవిలో మనం ఎక్కువగా తాగే పానియాల్లో చెరుకు రసం కూడా ఉంటుంది. ఇప్పుడు బాటిల్స్ రూపంలో కూడా అమ్ముతున్నారు. చెరుకు రసం తాగడానికి రుచిగా ఉండటమే కాకుండా కాస్త ఉపశమనంగా ఉంటుంది. అందుకే కొబ్బరి నీళ్ళు, చెరుకు రసాలను ఎక్కువగా విక్రయిస్తున్నారు. వేసవిలో వీటి డిమాండ్ ఎక్కువగా ఉన్నా సరే ధరలు మాత్రం మనకు అందుబాటులోనే ఉంటున్నాయి.
అయితే చెరుకు రసం ఆడే సమయంలో మనకు అర్ధం కాని విషయం ఏంటీ అంటే… చెరుకు మధ్యలో నిమ్మకాయ పెడతారు. అసలు అలా ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి తెలియదు. దానికి రెండు కారణాలు ఉన్నాయంటున్నారు చెరుకు రసం తీసే వాళ్ళు. ఒకటి పచ్చి చెరకు రసం పైత్యం చేస్తుందని భావించి దానికి విరుగుడుగా నిమ్మ రసం యాడ్ చేస్తారు. ఈ కారణంతోనే నిమ్మ చెక్క పెట్టి మర ఆడటం జరుగుతుంది.
మరో సమస్య కూడా ఉంది. మన ఆరోగ్యానికి కీడు చేసే సూక్ష్మ క్రిములు చెరుకు గడలోనూ, గడ పైనా ఎక్కువగా ఉంటాయి. కొందరు పైన ఉన్న పెళుసును ముందుగానే తొలగించి రసానికి వాడతారు. మరికొందరు ఒక్కోసారి కొంత వరకు తీసి అప్పుడు రసం తీస్తారు. అప్పుడు నిమ్మ రసం దానికి విరుగుడుగా, ఔషధంగా ఉపయోగ పడి మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక అల్లం కూడా దాదాపుగా ఇందుకే వినియోగిస్తూ ఉంటారు.