తిరుగులేదనుకునే నేత.. తనకు తానే అభయం ఇచ్చుకుంటున్నాడు. తనకిక ఎదురులేదనుకునే నాయకుడు.. ఏం పర్వాలేదనే భరోసా తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఎవరిని చూసి ఇలా భయపడుతున్నాడు. ఎవరు ఏకం అవుతున్నారని కలవరపడుతున్నాడు. భయపడ్డ మనిషే.. భయపడనని చెబుతాడు. కలవరపడ్డ మనిషే.. కేకలు పెడతాడు. అదిరిపడ్డవాడే అరవడం మొదలెడతాడు. ఇంతకీ ఎవరు ఏకం అవుతున్నారు? ఎవరు అంతగా భయపెడుతున్నారు?
తెలుగుదేశం పార్టీ. ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిని.. నాయకత్వలేమితో బాధపడుతోంది. నాయకులు విశ్వాసం కోల్పోయి.. పక్కచూపులు చూస్తున్నారు. కేడర్ బలంగా ఉన్నా.. అసలు మ్యాటర్ లేక ఇబ్బందులు పడుతోంది. కేవలం జగన్ చేసిన తప్పులనే ఊపిరిగా పీల్చుకుని.. లేవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికి భయపడే అవసరం జగన్ కు లేదు.
ఇక బీజేపీ. కేంద్రంలో అధికారంలో ఉంది. అఖండ భారత్ అంటూ అన్ని రాష్ట్రాల్లో అధికారం సంపాదించాలనే లక్ష్యంతో దూసుకుపోతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలో మాత్రమే పాగా వేయగలిగింది. ఉన్న ఆశల్లా తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ల మీదే. తెలంగాణలో కేసీఆర్ తనంతటతానే తప్పులు చేస్తూ.. బీజేపీ దారిని రహదారి చేస్తున్నాడు. ఇక్కడ కూడా జగన్ తడబడుతూ.. అదే పని చేస్తున్నాడు. అందుకే కమలం గట్టిగానే కన్నేసింది. కాని రాష్ట్రంలోని ఇతర పార్టీల నాయకుల మీదే ఎక్కువగా ఆధారపడుతోంది. తెలుగుదేశం స్థానాన్ని రీప్లేస్ చేయాలని చూస్తోంది.
ఇక పోతే జనసేన. ఎన్నికల్లో దాదాపు పరువు పోయింది. స్వయంగా పవన్ కల్యాణే తాను పోటీ చేసిన స్థానాల్లో గెలవలేకపోయాడు. కేడర్ అంతా నీరసపడిపోయింది. కాని ఒకే ఒక్క లాంగ్ మార్చ్ మళ్లీ ఊపిరి పోసింది. పవన్ కల్యాణ్ పేరు మళ్లీ ప్రత్యర్ధుల నోటి వెంట పదే పదే వినపడుతోంది. అయినా ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
వామపక్షాల సంగతి సరేసరి. కేవలం ప్రకటనలు.. కొన్ని యూనియన్ల పేరుతో ఉద్యమాలు తప్పితే.. చాలా వీకయిపోయారు.
మరి ఎవరి గురించి జగన్ భయపడుతున్నారు? అనేదే ప్రశ్న. పవన్ కల్యాణ్ ఢిల్లీ టూరే దీనికి క్షకారణమని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు అన్ కండిషనల్ గా బీజేపీతో మళ్లీ ఫ్రెండ్ షిప్ చేయడానికి రెడీ అయిపోయారు. కాని కమలం మాత్రం కాదని చెప్పేసింది. కాని జనసేనాని మాత్రం కమలనాథులతో కథ నడిపిస్తున్నట్లు హస్తినలో వినపడుతోంది. వామపక్షాల అభ్యంతరాలను కూడా తోసేసీ మరీ, పవన్ బిజెపితో చేయి కలపడానికి సిద్ధమైపోయినట్లు సమాచారం.
మరోవైపు టీడీపీ సైతం వీరికి సహకరించడానికి సిద్ధమైపోయింది. జగన్ ను ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. తమను , తమ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్న జగన్ ను దెబ్బ తీయాల్సిందేనని కత్తులు నూరుతున్నారు. అందుకే బీజేపీకి, జనసేనకు నేరుగా కాకపోయినా పరోక్షంగా సాయపడటానికి సిద్ధపడుతోంది. తమ ఎమ్మెల్యేలు బీజేపీలోకి పోయినా పర్వాలేదు గాని, వైసీపీలోకి వెళ్లకూడదని కోరుకుంటోంది.
మరోవైపు సీబీఐ కోర్టు బెయిల్ రద్దు చేయబోతుందనే వార్తలు వినపడుతున్నాయి. జగన్ జైలుకెళ్లక తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. అప్పుడు జనంలో ఉవ్వెత్తున సానుభూతి రేగాలి.. అలజడి రేగాలి.. అనే దిశగా జగన్ వ్యూహాలు సాగుతున్నాయి. అందుకే తనపై కుట్ర జరుగుతుందనే ప్రచారాన్ని ఈ విధంగా మొదలెట్టారు. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.