ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి పీసీసీ కావటం ఇష్టం లేదు అనేది అందరికీ తెలిసిందే. పీసీసీ ఎంపిక సమయంలో రేవంత్ ను జగ్గారెడ్డి బహిరంగంగానే వ్యతిరేకించారు. కానీ పీసీసీ ప్రకటన రావటం, జగ్గారెడ్డికి అదే రేవంత్ కింద వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వటం జరిగిపోయాయి. అధిష్టానం నిర్ణయమే నా నిర్ణయం అని జగ్గారెడ్డి కూడా ప్రకటించటంతో అంతా కూల్ అని అనుకున్నారు.
కానీ తాజాగా రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తనను కావాలనే అణిచివేసేలా ఉన్నారని, రేవంత్ కన్నా ముందే తను మూడు సార్లు ఎమ్మెల్యేనంటూ జగ్గారెడ్డి కామెంట్ చేశారు. అంతేకాదు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించటం లేదని అన్నారు. ఇంతవరకు కాంగ్రెస్ నాయకులు సరే తన ఆవేదన చెప్పుకుంటున్నారని భావించారు.
కానీ, జగ్గారెడ్డి అంతటితో ఆగకుండా నేను టీఆర్ఎస్ లోకి వెళ్లాలనుకుంటే నన్ను ఆపేవారు ఎవరు… అంటూ కామెంట్ చేయటం జగ్గన్న పార్టీ మారే ఆలోచనతో ఉన్నారా అన్న సందేహాలకు కారణం అవుతుంది. ఇది ఆవేదనా… మైండ్ గేమా అంటూ కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. పార్టీలో ఇబ్బంది ఉంటే డైరెక్ట్ గా మాట్లాడేవారు కానీ మధ్యలో టీఆర్ఎస్ లో చేరిక అంశం ఎందుకు తెరపైకి వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు.