– ఘనంగా యాదాద్రి మహాసంప్రోక్షణ
– కానరాని చినజీయర్ స్వామి
– తమ మధ్య గొడవల్లేవని ఈమధ్యే కేసీఆర్ ప్రకటన
– సీఎం మాటలు అబద్దమేనా?
– చినజీయర్ పై కోపంగా ఉన్నారా? లేక డ్రామానా?
యాదాద్రి ఆలయం కర్త, క్రియ కేసీఆర్ అయితే.. కర్మ మాత్రం చినజీయర్ స్వామి. ఇది ఎవరూ కాదనలేదని. యాదగిరి గుట్టను యాదాద్రిగా పేరు మార్చి ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణానికి అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు చినజీయర్. చివరకు ఆలయ పునఃప్రారంభం ఆయనే రాకుండా జరిగిపోయింది. అదికూడా చాలా సింపుల్ గా. దీని వెనుక చాలా పెద్ద కథే ఉందని రాజకీయ పండితులు అంటున్నారు.
సమతామూర్తి విగ్రహావిష్కరణ సమయంలో కేసీఆర్ కు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. అక్కడే చినజీయర్, కేసీఆర్ మధ్య దూరం ప్రారంభమైందని చెబుతున్నారు విశ్లేషకులు. శిలాఫలకంపై మోడీ ఫోటోను ముద్రించడం.. కనీసం కేసీఆర్ పేరు లేకపోవడంతోనే అలకపాన్పు ఎక్కి.. చినజీయర్ పై రివెంజ్ కు సైలెంట్ గా ప్లాన్ చేశారని అంటున్నారు.
వన్స్ కేసీఆర్.. ఒకర్ని శత్రువు అనుకుంటే ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది. దీనికి టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి మొన్నటి ఈటల ఇష్యూ దాకా ఎన్నో ఘటనలు ఉదాహరణగా ఉన్నాయి. ఇప్పుడు చినజీయర్ విషయంలో కూడా అదే జరుగుతోందనే చర్చ ఊపందుకుంది. కేసీఆర్ కోసం సమతామూర్తి ఉత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవాన్ని వాయిదా వేశారు చినజీయర్. అయినా కూడా ఆయన ఆ దిక్కు చూడలేదు సరికదా.. పార్టీ నేతల్ని సైతం పంపలేదు.
దీనిపై చర్చ నడుస్తుండగానే… చినజీయర్ కు చెందిన ఏళ్ల క్రితం నాటి పాత వీడియో ఒకటి బయటకొచ్చింది. అందులో సమ్మక్క సారలమ్మలను ఆయన అవమానించేలా మాట్లాడుతున్నట్లు ఉంది. దీంతో దుమారం రేగింది. ఏకంగా టీఆర్‌ఎస్ నేతలే చినజీయర్ ను టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేశారు. కేసీఆర్ పగ బట్టారని ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఈ వీడియో బయటకు రావడం.. ఆంధ్రా స్వామి అంటూ సెంటిమెంట్ రగిలించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో చినజీయర్ మీడియా ముందుకొచ్చి తన వాదనను వినిపించారు. దీని వెనుక కొందరు ఉన్నారని సంచలన ప్రకటన చేశారు. యాదాద్రి ప్రారంభోత్సవంపైనా స్పందిస్తూ పిలుస్తే వెళ్తాం లేదంటే లేదని కుండబద్దలు కొట్టేశారు. ఆ తర్వాత ఓ మీడియా సమావేశంలో చినజీయర్ తో తనకెలాంటి గొడవలు లేవని చెప్పారు కేసీఆర్.
సీన్ కట్ చేస్తే.. యాదాద్రి ప్రారంభోత్సవానికి చినజీయర్ కు పిలుపు వెళ్లలేదు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందించిన ఆయన లేకుండానే ప్రారంభం జరిగిపోయింది. దీంతో చినజీయర్ ను పూర్తిగా పక్కనపెట్టేశారనే విషయం క్లారిటీగా అర్థం అవుతోందని అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ ఇంకో అనుమానాన్ని కూడా తెరపైకి తెస్తున్నారు. అదేంటంటే.. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అయింది. ఇంతకుముందులా లేదు. బండి సారథ్యంలో దూసుకుపోతోంది. చినజీయర్ కు బీజేపీ ముద్ర వేసి.. ఆయన ద్వారా ఓట్లు చీల్చి లాభం పొందేలా కేసీఆర్ డ్రామాకు తెరతీశారా? అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ప్రస్తుతానికైతే చినజీయర్ ను కేసీఆర్ దూరం పెట్టారనేది స్పష్టంగా అర్థం అవుతోందని అంటున్నారు. రానున్న రోజుల్లో ఇది ఎటువైపు దారితీస్తుందో అనేది చూడాలని చెబుతున్నారు.