– రాష్ట్రపతి ఎన్నికను క్యాష్ చేసుకుంటున్న మమత!
– విపక్ష పార్టీలను ఓచోటకు చేర్చి రాజకీయాలు
– కేసీఆర్ వెళ్లకపోవడంపై అనుమానాలు
– బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలు లేకుండా అడుగులు
– పీకే ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నానంటున్న కేసీఆర్.. విపక్షాల మీటింగ్ కు ఎందుకు వెళ్లలేదు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం మమతాబెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎందుకు డుమ్మా కొట్టారు. కేసీఆర్ ఆలోచన ఏమై ఉంటుంది? వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారు? రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థిని ఎంపిక చేస్తుంటే ఎందుకు వెళ్లలేదు? ఇలాంటి ఎన్నో ప్రశ్నల నడుమ.. అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నమమతా బెనర్జీ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు దేశవ్యాప్తంగా 19 విపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు. అయితే.. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరుకాలేదు. దేశవ్యాప్తంగా జాతీయ రాజకీయాల్లో వెళ్లి చక్రం తిప్పాలని తెగ తాపత్రయపడుతున్నారు కేసీఆర్. నిజానికి ఈ సమావేశం ఓ చక్కటి వేదిక. కానీ.. ఆయన మాత్రం వెళ్లలేదు. ఈ నేపథ్యంలో అసలు కేసీఆర్ ఎజెండా ఏంటనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది.
జాతీయ పార్టీ ఏర్పాటు విషయంలో కేసీఆర్ కు అన్నివిధాలా సహకరిస్తోంది ఒక్క ప్రశాత్ కిశోర్ మాత్రమే. రాష్ట్రంలో టీఆర్ఎస్ కోసం పని చేస్తున్న ఆయన.. జాతీయ స్థాయిలోనూ కేసీఆర్ రాజకీయ మార్గాన్ని సుగమం చేసే పనిలో బిజీగా ఉన్నారు. అదేవిధంగా తాను ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీలో ప్రశాంత్ కిశోర్ కు అతి కీలకమైన పోస్టును కూడా కట్టబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి లేదా సెక్రటరీ జనరల్ హోదాలో పీకే సేవలను కేసీఆర్ ఉపయోగించుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే కేవలం పీకే సలహా, సూచనలతో నేషనల్ పాలిటిక్స్ లో ఎలా నెగ్గుకురాగలుగుతారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.
బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసే బీఆర్ఎస్ కోసం కేసీఆర్ ఇప్పటికే పలువురు మేధావులు, సినీ, రాజకీయ, రైతు సంఘాల ప్రముఖులు మాజీ ఐఏఎస్, ఏపీఎస్ లతో భేటీలు నిర్వహించారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిల్లో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. అదేవిధంగా పలు ప్రాంతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెసేతర సీఎంలతో సమావేశమౌతున్నారు. ఇదే నేపథ్యంలో జాతీయ స్థాయిలో రాజకీయంగా క్రియా శీలకంగా వ్యవహరించాలనే లక్ష్యంతో ఉన్న కేసీఆర్ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తో సంబంధం లేని పార్టీలతోనే సత్సంబంధాలు నెరపేందుకే ఉత్సాహంగా ఉన్నట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు.
అయితే.. ఇది పెద్దగా వర్కవుట్ అవ్వదని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మూడో కూటమికే సహకరించని ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు, అధినేతలు కేసీఆర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న జాతీయ పార్టీకి సహకరిస్తారా? అనేది కష్టమేనని చెబుతున్నారు. ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితుల్లో వివిధ ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పంచనే ఉన్నాయి. అవి విడిగా పోటీ చేసి మనుగడ సాగించే పరిస్థితి లేదు. అలాంటప్పుడు కేసీఆర్ పార్టీకి అండగా ఏ పార్టీ ముందుకొస్తుందనేది పెద్ద ప్రశ్న. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పుతారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్, ఆప్ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్ ను మరింత బలహీనపర్చి అవసరమైతే ఆ పార్టీ నేతలను తమ గూటికి చేర్చుకునే అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా టీఎంసీ ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసింది. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తున్న దీదీ.. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు. అయితే..ఈ సమావేశానికి కేసీఆర్ దూరంగా ఉండటంతో జాతీయ రాజకీయాలంటూ పలు పార్టీలను ఏకం చేయాలనుకుంటున్న కేసీఆర్ కు నష్టం తెచ్చి పెడుతుందని అంటున్నారు విశ్లేషకులు.