తెలంగాణ ఉద్యమ చరిత్రను కేసీఆర్ మార్చాలనుకుంటున్నారా? టీఆర్ఎస్ పోరాటంతోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని కొత్త తరానికి చెప్పాలనుకుంటున్నారా? తొలి దశ ఉద్యకారులను కేసీఆర్ విస్మరించడం వెనుక ఉద్దేశ్యం అదేనా?.. ఇప్పుడివే ప్రశ్నలు తెలంగాణవాదుల్లో కలుగుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రోజున ఆయనకు చిత్రపటానికి కనీసం నివాళులు కూడా అర్పించలేదని విమర్శలు మూటగట్టుకున్న కేసీఆర్.. తాజాగా కొండా లక్ష్మణ్ బాపూజీ విషయంలోనే అలాగే వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ కేవలం నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడే కాదు.. టీఆర్ఎస్ స్థాపించిన తొలినాళ్లలో పార్టీ కార్యాలయం కోసం తన నివాసమైన జల దృశ్యాన్ని కేసీఆర్‌కు అప్పగించారు. అలాంటి మహనీయుడి వర్ధంతి రోజున కనీసం కేసీఆర్ స్మరించుకోకపోవడం, నివాళులర్పించకపోవడం దారుణమని మండిపడుతున్నారు.
కేసీఆర్ తీరు చూస్తోంటే.. తెలంగాణ సాధన క్రెడిట్ కేవలం టీఆర్ఎస్‌కు దక్కాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని ఆర్పించిన ప్రొఫెసర్ జయ శంకర్ ఇప్పటికే మరిపించే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విషయంలో కూడా అదే బాటపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈనెలలోనే సెప్టెంబర్ 27న ఆయన జయంతి ఉండటంతో.. అప్పుడైనా గౌరవిస్తారో లేదో చూడాలి అని చర్చించుకుంటున్నారు.