కీలకమైన అయోధ్య తీర్పు సందర్భంగా సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీస్ శాఖ వ్యవహరశైలి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. కేంద్రం ముందస్తు జాగ్రత్తగా హెచ్చరికలు పంపినా… సీఎం తన ఆప్తమిత్రుడు కోసం అనుకూలంగా వ్యవహరించారని మండిపడుతున్నారు.
అయోధ్యతీర్పు నేపథ్యంలో… హిందూ-ముస్లిం సంస్థలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని, పుకార్లు నమ్మవద్దని సుప్రీం కోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను, ఆయా సంఘాలను కోరింది. తీర్పు వచ్చాక కూడా సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.
కానీ అయోధ్యతీర్పు తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. మజీద్ నిర్మాణానికి ఇచ్చిన 5 ఎకరాల బిక్షం తమకు అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. పైగా సుప్రీంను గౌరవిస్తామని చెబుతూనే… తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తపర్చారు.
అదే రోజు సాయంత్రం ఓల్డ్ సిటిలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది ఎంఐఎం. పైగా అప్పటికే ఓవైసీ సుప్రీం తీర్పుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ సభకు అనుమతి రద్దు చేస్తుంది తెలంగాణ పోలీస్ శాఖ అని అంతా భావించారు. కానీ సభను యధావిధిగా కొనసాగించేందుకు పోలీస్ యంత్రాంగం మొగ్గుచూపటంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని కొందరు సీనీయర్ అధికారులతో పాటు, ప్రజా సంఘాలు ఆశ్చర్యానికి గురయ్యారు.
చిన్న చిన్న దుకాణదారులపైనే ఆంక్షలు వేసిన ప్రభుత్వం… ఎంఐఎం సభకు అనుమతివ్వటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓవైసీ మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి చేయిదాటిపోయేదని, అప్పుడు ఎవరు బాధ్యత వహించే వారని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు చేపట్టే ర్యాలీలకే అనుమతివ్వని సర్కార్… అయోధ్య తీర్పు అనంతరం ఎంఐఎం సభకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
సీఎం కేసీఆర్ అయోధ్యతీర్పుపై స్పందించలేదని, పైగా తన ఆప్తమిత్రుడు ఎంఐఎంకు అనుకూలంగా వ్యవరించారని మండిపడుతున్నారు. అయితే దీనిపై కేంద్ర హోంశాఖతో పాటు బీజేపి ఎలా స్పందిస్తుందో చూడాలి.