ఉపఎన్నికల జొరం వచ్చిందనుకుంట కేసీఆర్ సారుకి.. అందుకే సూది మందం అయినా సహాయం అవుతుందని ఇంతకుముందు అసెంబ్లీలో సూదీ-దబ్బనం పార్టీ అని విమర్శించిన సీపీఐ దగ్గర మోకరిల్లారు కేసీఆర్. ‘అసలు తెలంగాణలో ఏ పార్టీ లేదు, అంతా గులాబీమయం. మాకు తిరుగులేదు, కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రపంచానికే ఆదర్శం, ఏ ఎన్నిక వచ్చిన ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావు’ అంటూ బీరాలు పలికే గులాబీ లీడర్స్, హుజూర్ నగర్ పేరు వింటేనే ఇప్పుడు వణికిపోతున్నారు.
ఓడిపోతే జరిగేపరిణామాలు గులాబీ బాస్‌కు స్పష్టంగా తెలుసు. అందుకే కొడవలి సహాయం కోరారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీపీఐ మద్దతు టీఆర్ఎస్ అడుగుతుందని ఎవరు ఊహించలేదు. కానీ హుజూర్‌నగర్ ఎన్నికల విషయంలో ఇంటలిజెన్స్ ఇచ్చిన నివేదికతో కంగారుపడ్డ కేసీఆర్ అందుకే సీపీఐ మద్దతు కోరాలని నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ సీనియర్ నేతలను సీపీఐ ఆఫీస్‌కు పంపించి మద్దతు ఇవ్వాలని కోరారు. మేము అడిగితే ఆఘమేఘాలమీద మద్దతు ఇస్తారు అనుకున్న కేసీఆర్‌కు సీపీఐ నేతలు కాస్త అసంతృప్తినే మిగిల్చారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ నేతలు చెప్పడం టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చింది. సీపీఐ ఒక వేళ మద్దతు ఇవ్వకపోతే, గులాబీ బాస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
హుజూర్ నగర్‌లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారితోనే.. అందుకే నియోజకవర్గంలో కొంత ఓటు బ్యాంకు ఉన్న సీపీఐ తలుపుతట్టారు కేసీఆర్. అసెంబ్లీ సాక్షిగా కమ్యూనిస్టు పార్టీలపై సూదీ దబ్బనం పార్టీలు అంటూ హేళన చేస్తూ మాట్లాడిన కేసీఆర్, ఈరోజు అవే పార్టీల సహాయం కోరడం చూస్తుంటే దొరికితే జుట్టు లేకపోతే కాళ్లు అన్న చందంగా ఉందని అనలిస్టులు అంటున్నారు. ఊసరవెళ్లిలా అవసరం ఉన్నప్పుడు మాటలు మార్చటం ఆయనకు అలవాటే కదా అని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.