జ్ఞానవాపి మందీర్ వివాదంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి మసీదులోనూ శివలింగాన్ని వెతకాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయంలో రోజుకో కొత్త వివాదాన్ని తెరపైకి తేవాల్సిన పని లేదని తెలిపారు.
జ్ఞానవాపి వివాదం విశ్వాసంతో ముడిపడి ఉందన్నారు. ఈ విషయంలో కోర్టు తీర్పును అందరూ అంగీకరించాలని కోరారు. నాగపూర్ లో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ తృతీయ సంవత్సరం పదాధికారుల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అయోధ్య అంశం వేరు, ప్రస్తుత వివాదం వేరు అని తెలిపారు. చారిత్రక కారణాల వల్ల రామజన్మభూమి విషయంలో తాము పోరాటం సాగించామన్నారు. ఆ విషయాన్ని తాము పూర్తి చేశామన్నారు. ఇప్పుడు ఎలాంటి ఉద్యమానికి తాము నాయకత్వం వహించాలని అనుకోవడం లేదన్నారు.
ప్రస్తుతం జ్ఞానవాపి వివాదం నడుస్తోందన్నారు. చరిత్రను మనం మార్చలేమన్నారు. ఆ చరిత్రను అప్పటి హిందువులు, ముస్లింలు రాయలేదన్నారు. ఇది గతంలో జరిగిందన్నారు. దేశంలోకి ఇస్లాం ప్రవేశించిన సమయంలో హిందువుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు పెద్ద ఎత్తున ఆలయాలను ధ్వంసం చేశారని తెలిపారు.
జ్ఞానవాపి కేసుతో సంబంధం ఉన్న వారంతా కలిసి కూర్చుని సమస్యకు సామరస్య పూర్వకమైన పరిష్కారాన్ని చర్చల ద్వారా కనుక్కోవాలని తెలిపారు. అయితే ప్రతిసారి ఇది సాద్యం కాదన్నారు. అందుకే పలువురు ఈ విషయంలో కోర్టును ఆశ్రయిస్తున్నారని తెలిపారు. అందువల్ల ఈ విషయంలో కోర్టు తీర్పును అందరూ అంగీకరించాలని కోరారు.