ఓనర్లు, కిరాయిదార్లు అన్న అంశం తెరమీదకు వచ్చాక… ఈటెల గులాబీ దండు నుండి బయటకు వచ్చేస్తారు, ఈటెలకు పొమ్మనలేక పొగపెడుతున్నారు, తన ముందే ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చి… తనను తక్కువ చేస్తున్నారు ఇలా రకరకాల ప్రచారం సాగింది. ఈటెల వ్యాఖ్యలు కూడా ఆ ప్రచారంలో పెట్రోల్ పోసి మంటలంటిచినంత పనిచేశాయి. టీఆర్ఎస్ పార్టీ నుండి వలసలు అనే మాట వస్తే చాలు అందరి చూపు ఈటెలవైపే వెళ్తుంది.
కానీ కొంతకాలంగా ఈ ప్రచారం కాస్త సద్దుమణిగింది. ఈటెల పార్టీ మార్పు అనేది వార్తల్లోనే కాదు ప్రచారంలోనూ లేకుండా పోయింది. అలాంటి సమయంలో ఈటెల ఇప్పుడు నేను పార్టీ మారటం లేదు, నేను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా అంటూ వివరణ ఇవ్వటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. చెప్పాలనుకుంటే… వార్తలు వచ్చినప్పుడు చెప్పాలి, అప్పుడు సైలెంట్ గా ఉండి… ఇప్పుడు బహిరంగంగానే నేను ఎక్కడికీ వెళ్లటం లేదు, కేసీఆర్‌ను విడిచిపెట్టలను అంటూ ప్రకటన చేయటంలో ఎదో అంతరార్ధం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
అంతటితో వదిలిపెట్టకుండా… ఈటెల తన శాఖకు నిధులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఆపితే కుదరదు అన్నట్లుగా మాట్లాడారు. ఇతర శాఖలకు బడ్జెట్ లేకపోతే నిధులు ఆపొచ్చు, కానీ ఆరోగ్య శాఖకు అలా కాదంటూ తన శాఖకు నిధులు ఇవ్వాల్సిందేనని హెచ్చరిక చేసినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ మధ్య ఈటెల అంశం వార్తల్లో వెనకడుగు వేసినా… ఈటెల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ ఓనర్లు-కిరాయిదార్లతో పాటు… తనకు ఇష్టంలేని మంత్రులున్న శాఖలకు నిధులు ఇవ్వటం లేదా అన్న ప్రశ్నలకు మరోసారి తావిచ్చినట్లయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.