దళిత బంధు అమలుపై చర్చ కోసం ప్రగతి భవన్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాజీ మంత్రి మోత్కుపల్లికి దక్కిన గౌరవం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ పార్టీ, పదవిలో లేని ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీటు పక్కనే కుర్చీ వేయడం ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో మంత్రులు, సీఎస్ లేదా చర్చించే అంశానికి చెందిన శాఖల ఉన్నతాధికారులు సీఎం పక్కన కూర్చుంటారు. కానీ ఇందులో ఏ సమీకరణాల్లోనూ ఫిట్ కాని మోత్కుపల్లికి.. కేసీఆర్ పక్కనే చోటు దక్కడంతో ఏదో పెద్ద కథే ఉందన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే దళిత బంధు చైర్మన్ పదవి ఆయనకే ఇస్తారన్న ప్రచారం ఉండంటంతో.. తాజా ఘటనతో అది గ్యారంటీనే అన్న వాదనలు బలపడుతున్నాయి.
తొలిసారి దళిత బంధుపై ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించినప్పుడు.. పార్టీ వద్దని చెప్పినా బీజేపీ ప్రతినిధిగా హాజరయ్యారు మోత్కుపల్లి. అయితే సొంత పార్టీ నేతలే అభ్యంతరం తెలపడంతో, తాను హాజరుకాకపోయి ఉంటే బీజేపీ నష్టపోయేదని, ఆపార్టీపై దళిత వ్యతిరేకి అన్న ముద్రపడేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయన వివరణతో బీజేపీ నాయకత్వం సంతృప్తి చెందకపోవడంతో… చివరికి ఆ పార్టీకి రాజీనామా చేశారు.
బీజేపీని వీడిన తర్వాత మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరతారని అంతా భావించారు. ఆయనే స్వయంగా టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కానీ ఆ మాట చెప్పి నెలలు గడిచినా.. గులాబీ గూటికి ఇంకా వెళ్లలేదు. అయితే మధ్య మధ్యలో ప్రెస్ మీట్లు పెట్టి మాత్రం కేసీఆర్‌ను ఆకాశానికెత్తుతున్నారు. అభినవ అంబేద్కర్ అంటూ కొనియాడుతున్నారు. మోత్కుపల్లి వ్యవహారం చూస్తున్న వారంతా.. టీఆర్ఎస్‌లో ఏదో పదవి ఆశిస్తున్నారని, కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకోవడానికే ఈ పాట్లు పడుతున్నారన్న అభిప్రాయానికి వచ్చేశారు. అయితే తాజా పరిణామాలను చూస్తోంటే.. కేసీఆర్ ప్రసన్నమైనట్టేనని, మోత్కుపల్లి ప్రమోషన్ వచ్చినట్టేనని అంతా అనుకుంటున్నారు.