టాలీవుడ్ కు సంబంధించి ప్రభుత్వాలతో ఎలాంటి అధికారిక సమావేశం ఉన్నా దానికి చిరంజీవి, నాగార్జున కచ్చితంగా హాజరవుతారు. గతంలో తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో కూడా వీళ్లిద్దరూ కనిపించారు. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో జరిపిన చర్చల్లో మాత్రం నాగార్జున కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా పుకార్లు గుప్పుమన్నాడు. కొన్ని రోజులుగా మీడియాకు అందుబాటులో ఉంటున్న నాగార్జున, వెంటనే వీటిపై రియాక్ట్ అయ్యారు.
“ముఖ్యమంత్రి జగన్ నుంచి నాక్కూడా ఆహ్వానం అందింది. లెక్కప్రకారం చిరంజీవితో నేను కూడా వెళ్లాల్సి ఉంది. కానీ మీరు చూస్తున్నారుగా కొన్ని రోజులుగా బంగార్రాజు ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాను. ఈరోజు ఇలా మీడియాతో ఇంటర్వ్యూలు పెట్టుకున్నాను. ఈరోజు మిస్సయితే ఇక నాకు టైమ్ లేనట్టే. రేపే సినిమా రిలీజ్. పైగా సాయంత్రం మరో పెద్ద ఫంక్షన్ పెట్టుకున్నాం. అందుకే మీటింగ్ కు వెళ్లలేకపోయాను. సీఎం జగన్ తో చిరంజీవికి మంచి సంబంధాలున్నాయి. అంతా మంచే జరుగుతుంది.”
ఇలా మీటింగ్ పై స్పందించాడు నాగార్జున. ఈ సందర్భంగా మరోసారి టికెట్ రేట్లపై స్పందించారు నాగార్జున. ఏపీలో తగ్గించిన టికెట్ రేట్ల ప్రభావం బంగార్రాజు సినిమాపై ఉండదన్నారు. ఇప్పుడున్న టికెట్ రేట్లు బంగార్రాజుకు సరిపోతాయన్న నాగార్జున.. ఈ సంక్రాంతికి కుటుంబ ప్రేక్షకులు బంగార్రాజు సినిమా కోసం థియేటర్లకు వస్తారని గట్టిగా చెబుతున్నాడు.