కర్ణాటకలో అవినీతికి పాల్పడిన బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్పను ఎందుకు అరెస్టు చేయలేదని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. తమ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేసినప్పుడు ఆ ఎమ్మెల్యేను మాత్రం ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రధాని మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
కర్ణాటక హైకోర్టు ..విరూపాక్షప్పకు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసిందని ఆయన ట్వీట్ చేస్తూ.. సిసోడియా ఇంట్లో సీబీఐ దాడి చేసినప్పుడు అధికారులకు ఏమీ లభించలేదని, కానీ ఆయనపై సిబిఐ, ఈడీ పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపాయని అన్నారు. మీ పార్టీ ఎమ్మెల్యే అయిన విరూపాక్షప్ప ఇంట్లో భారీగా నగదు దొరికిందని, కానీ మీరు నోరెత్తడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు.
అవినీతిపై పోరాటం చేస్తామని మీరు అనరాదని, అది మీ నోటివెంట రావడం బాగుండదని దుయ్యబట్టారు. విరూపాక్షప్ప కొడుకు ఇంటిపై లోకాయుక్త దాడిని గురించి ప్రస్తావించిన ఆయన.. ఆ కొడుకుకు బీజేపీ ‘పద్మభూషణ్’ అవార్డునిచ్చి సత్కరించవచ్చునని ఎద్దేవా చేశారు.
ఇక కర్ణాటక హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన విరూపాక్షప్పకు బెంగుళూరులో మంగళవారం ఆయన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆహ్వానం పలికారు.