డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ద్రోహం చేస్తుందని ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదల కోసం డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి నాలుగేళ్లవుతున్నా వాటి పంపిణీకి మాత్రం నోచుకోవడం లేదని విమర్శలు గుప్పించారు.
ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రభుత్వం సూర్యాపేట జిల్లాలో సుమారు 500 డబుల్ ఇళ్ల ప్లాట్లను నిర్మించి 4 సంవత్సరాలు అవుతుందని, మున్సిపాలిటీ ఏరియాలో కూడా ఇండ్లను, ప్లాట్లను నిర్మించి నాలుగేళ్లైనా… వాటి పంపిణీ కార్యక్రమాలు మాత్రం ప్రభుత్వం చేపట్టడం లేదని మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇండ్లను నిర్మించి ఐదేళ్లు దాటినా కేసీఆర్ కు పంపిణీ చేయడానికి మనసు రావడం లేదన్నారు. కట్టించిన ఇండ్లను పేదవారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనిని ఎలక్షన్లలో ఏ రకంగా వాడుకోవాలని చూస్తున్నారంటూ నిలదీశారు.
ఇది చాలా దుర్మార్గపు పని అని.. మీ ఆలోచన విధానం దారుణంగా ఉందంటూ ఆకునూరి మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు లక్ష డబుల్ బెడ్రూంలను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని సోషల్ డెమోక్రటిక్ ఫోరం నుంచి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
దీంతో ఇండ్లను నిర్మించి ఐదారేళ్లు పూర్తవుతున్నా అర్హులకు ఇవ్వకపోవడంతో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పోరాటాన్ని చేస్తున్నారు. గతంలో హనుమకొండలోని అంబేదక్కర్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తైనా ఇవ్వకపోవడంతో దాదాపు 300 కుటుంబాలు మురికి కూపాల్లో ఉన్నాయన్నారు. ఇండ్లు లేనివారిని చూస్తే తనకు బాధ వేసిందన్నారు. అందుకే లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించే వరకూ అక్కడే ఉన్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో.. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై ఫిర్యాదు చేస్తామన్నారు ఆయన. ప్లాట్లను ఎమ్మెల్యే డబ్బులకు అమ్ముకున్నారనే ఆరోపణలున్నాయని చెప్పారు.