ఓ సినిమా ఎందుకు ఎక్కువ టైమ్ తీసుకుంటుంది? భారీ సెట్స్ లేదా గ్రాఫిక్ వర్క్ ఉన్నప్పుడు ఎక్కువ టైమ్ పడుతుంది? లేదా సినిమా అంతా పూర్తయిన తర్వాత ఓసారి రషెష్ చూసుకొని రీషూట్స్ చేయాలని నిర్ణయించినప్పుడు టైమ్ ఎక్కువ పడుతుంది? మరి ఎలాంటి గ్రాఫిక్స్ లేని, ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్లని సినిమాకు ఏడాదికి పైగా సమయం ఎందుకు?
ఎన్టీఆర్-కొరటాల సినిమాపై ఇప్పుడు అందరికీ ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. షూటింగ్ కు 6 నెలలు, పోస్ట్ ప్రొడక్షన్ కు మరో 2 నెలలు టైమ్ వేసుకున్నప్పటికీ అక్టోబర్ నాటికి సినిమా రిలీజ్ అవ్వాలి.
కానీ ఎన్టీఆర్ సినిమాను 2024, ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇంత టైమ్ ఎందుకనేది ఇప్పుడు అందరికీ తొలిచేస్తున్న ప్రశ్న. పోనీ ఎన్టీఆర్ ఏమైనా రెండు సినిమాలు సమాంతరంగా చేస్తున్నాడా? లేక కొరటాల ఏమైనా 2 సినిమాలు చేస్తున్నాడా? అలా చేస్తే కాల్షీట్ల సమస్య ఉంటుంది. కానీ ఎన్టీఆర్-కొరటాల ఇద్దరి చేతిలో ఇదే సినిమా ఉంది.
ప్రస్తుతానికైతే ఈ అంశంపై ఎవ్వరూ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. క్వాలిటీ కోసం టైమ్ తీసుకోవడంలో తప్పు లేదు, కానీ ఒకే సినిమా కోసం, అది కూడా రెగ్యులర్ రివెంజ్ డ్రామా మూవీ కోసం ఏడాదికి పైగా టైమ్ తీసుకోవడం ఎంత వరకు సమంజసం. పైగా రాజమౌళి, సుకుమార్ టైపులో సినిమాను చెక్కే రకం కూడా కాదు కొరటాల.