ఆది సాయికుమార్.. సాయికుమార్ తనయుడిగా మంచి క్రేజ్ ఉంది. కానీ సినిమాల పరంగా చూసుకుంటే మాత్రం క్రేజ్ నిల్లు. అతడు నటించిన సినిమా ఆడిన దాఖలాల్లేవ్. మినిమం గ్యాప్ లో సినిమాలు చేస్తూ, మ్యాగ్జిమమ్ ఫ్లాపులు అందుకున్న హీరోగా మాత్రం ఆది సాయికుమార్ రికార్డ్ సృష్టించాడు. మరి ఇన్ని ఫ్లాపులు వస్తున్నప్పటికీ ఆదికి ఎలా అవకాశాలు వస్తున్నాయి.? అతడితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? ఆది సాయికుమార్ రెమ్యూనరేషన్ ఎంత? అతడి సినిమాలకు వచ్చేది ఎంత?
ఇలాంటి ఎన్నో అనుమానాలు సాధారణ ప్రేక్షకులకు రావడం సహజం. అలాంటి వాళ్లందరి కోసమే ఈ సమాచారం. ఆది సాయికుమార్ తో సినిమా చేస్తే అది ఫ్లాప్ అవుతుంది. వసూళ్లు బొత్తిగా రావు. ప్రమోషన్ కోసం పెట్టిన పెట్టుబడి కూడా ఒక్కోసారి తిరిగి రాదు. మొన్నటికిమొన్న అతిథి దేవోభవ అనే సినిమా చేస్తే మొదటి రోజు 15 లక్షల రూపాయలొచ్చాయి. ఆ తర్వాత 3 రోజులకే దుకాణం సర్దేసింది ఆ సినిమా.
అయినప్పటికీ ఆది సాయికుమార్ తో నిర్మాతలు సినిమాలు చేయడానికి ప్రధాన కారణం హిందీ మార్కెట్. ఆది సాయికుమార్ కు హిందీ డబ్బింగ్ రైట్స్ బాగా పలుకుతాయి. అతడి తాజా చిత్రం ఒకటి కోటి 25 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇక అమెజాన్ లో ఎంతోకొంతకు సినిమా అమ్ముడైనా నిర్మాత ఒడ్డున పడినట్టే.
Advertisements
ఇప్పుడు అసలు లెక్కలోకి వద్దాం. ఆది సాయికుమార్ రెమ్యూనరేషన్ 40 లక్షలు. మరో 40-50 లక్షల్లో కనుక సినిమా పూర్తి చేయగలిగితే, పైన చెప్పిన మోడల్ లో బిజినెస్ ఈజీగా అయిపోద్ది. నిర్మాత హ్యాపీ. ఈ లెక్క ఏమాత్రం తప్పినా నిర్మాతకు నష్టం తప్పదు. అందుకే కోటిలో సినిమా తీసి కోటిన్నరతో బయటపడ్డానికి ప్రయత్నిస్తారు కొత్త నిర్మాతలు. ఆదితో సినిమాలు తీయడానికి ఇదే కారణం. ప్రస్తుతం ఆదిసాయికుమార్ చేతిలో 5 సినిమాలున్నాయి. అంటే అతడు 2 కోట్లు సంపాదించాడన్నమాట. సో.. ఆది కూడా హ్యాపీ.