దర్శకధీరుడు రాజమౌళికి, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మధ్య ఉండే బాండింగే వేరు. పలు వేదికలపైనా రాజమౌళిని ఎన్టీఆర్ ఆటపట్టించడం చూశాం కూడా.. రాజమౌళి కెరీర్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ మూవీ ‘స్టూడెంట్ నెంబర్ వన్’తోనే.. వీరిద్దరి కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది.
ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అన్న పేరు టాలీవుడ్ లో ఉంది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దగ్గర పలు సీరియల్స్ కు రాజమౌళి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఈ క్రమంలోనే ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రాజమౌళిని దర్శకుడిగా పరిచయం చేస్తూ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తెరకెక్కించారు. తనకు దర్శకత్వం ఛాన్స్ రావడంతో రాజమౌళి ముందు ఎగిరి గంతేశారట.
అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ హీరో అని తెలియడంతో ఒక్కసారిగా రాజమౌళికి నీరసం వచ్చిందట. తన మొదటి సినిమాకు ఇలాంటి హీరో దొరికాడు ఏంటా? అని ఫీల్ అయ్యారట. అప్పటికే ఎన్టీఆర్ స్టిల్స్ చూసిన రాజమౌళి ఎన్టీఆర్ బొద్దుగా, లావుగా ఉండటంతో తన సినిమాకు ఎంత వరకూ సూట్ అవుతాడు అని కాస్త టెన్షన్ పడ్డాడట.
కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి నాలుగైదు సీన్లు చేసిన వెంటనే ఎన్టీఆర్ లో అమోఘమైన నటన ఉందన్న విషయాన్ని రాజమౌళి గుర్తించారట. ఆ సినిమాలో ఎన్టీఆర్ లో ఉన్న అన్ని నటనా రసాలను తెరపై ఆవిష్కరించడం కుదర్లేదు. అందుకే తన రెండో సినిమాలోనూ ఎన్టీఆర్ హీరోగా పెట్టుకుని సింహాద్రి లాంటి యాక్షన్ సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టాడు రాజమౌళి.