ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2022లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ ఐపీఎల్ లో రాజస్థాన్ రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ పరాజయంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి రాజస్థాన్ పడిపోయింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ను శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు పంపాడు. దీంతో బ్యాటింగ్ కు వచ్చిన అశ్విన్ 8 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సంజూ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మ్యాచ్ అనంతరం తన నిర్ణయంపై సంజూ క్లారిటీ ఇచ్చాడు. అశ్విన్ ను మూడో స్థానంలో పంపాలని ఐపీల్ సీజన్ మొదలు కావడాని కన్నా ముందే జట్టు వ్యూహాలు రచించిందన్నారు.
‘ గత సీజన్ నుంచి నేను 3 వ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతున్నాను. అందుకే అవసరమైనప్పుడు జట్టు ప్రయోజనాల కోసం నేను 4 లేదా 5 వ స్థానంలో బ్యాటింగ్ కు దిగాలని నిర్ణయించుకున్నాము. అందుకోసమే ఆ వ్యూహాన్ని అమలు చేశాము’ అని అన్నారు.
‘ అలాంటి వ్యూహాలను అమలు చేయడంలో అశ్విన్ భాయ్ లాంటి వాళ్లకు మనకు స్వేచ్ఛనిస్తారు. మొదటి మూడు మ్యాచ్ ల్లో దేవదత్ పడిక్కల్ మూడో స్థానంలో వచ్చారు. మూడో స్థానంలో అశ్విన్ లేదా పడిక్కల్ ను పంపాలన్న వ్యూహాన్ని సీజన్ కు ముందే జట్టు రచించింది’ అని తెలిపారు.