భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని న్యాయస్థానాల్లో ఉపయోగించడంతో పాటు దేశ అధికార భాషగా సంస్కృతం ఎందుకు ఉండకూదంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కూడా గతంలో ఈ విషయాన్ని ప్రతిపాదించారని పేర్కొన్నారు.
చట్ట ప్రకారం పాలనా, న్యాయస్థానాలల్లో హిందీ, ఇంగ్లీషులు అధికార భాషలుగా ఉపయోగిస్తున్నామని ఆయన అన్నారు. న్యాయస్థానాల్లో ప్రాంతీయ భాషల్లో వ్యవహారాలు జరగాలని ప్రతిపాదనలు వస్తున్నాయన్నారు. ఇప్పటికే జిల్లా స్థాయి కోర్టుల్లో ప్రాంతీయ భాషల్లోనే పిటిషన్లు స్వీకరిస్తున్నారని చెప్పారు. వాటికి కోర్టులు ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదన్నారు.
సంస్కృత భారతి ఆధ్వర్యంలో నాగ్ పూర్‌లో ‘అఖిల భారతీయ ఛత్ర సమ్మేళన్’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… సంస్కృతం అనేది దక్షిణ లేదా ఉత్తర భారతదేశానికి చెందినది కాదన్నారు. లౌకిక వినియోగానికి సంపూర్ణ సామర్థ్యం కలిగిన భాష అని ఆయన పేర్కొన్నారు.
దేశంలో అధికార భాష సమస్య అపరిష్కృతంగా ఉండకూడదని తాను భావిస్తున్నానన్నారు. యూనియన్ ఆఫ్ ఇండియా అధికార భాషగా సంస్కృతం ఉండాలనే దిశగా అంబేడ్కర్ చొరవ తీసుకున్నట్టు వార్త సంస్థలు పేర్కొన్నాయి. మన ప్రాంతీయ భాషలతో మమేకమయ్యే ఏకైక భాష సంస్కృతమన్నారు.
ఉర్దూతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో సంస్కృత మూలాలు ఉన్న పదాలు వుంటాయన్నారు. అంబేడ్కర్ ప్రతిపాదించినట్లుగా సంస్కృతం అధికార భాష ఎందుకు కాకూడదని తనను తాను ప్రశ్నించుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ మార్పు రాత్రికి రాత్రే జరగదని, దీనికి కొన్నేండ్లు పడుతుందని చెప్పారు.