మరో 4 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది శేఖర్ సినిమా. రాజశేఖర్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో రాజశేఖర్ తనయ శివానీ కూడా నటించింది. పైగా రాజశేఖర్-శివానీ ఇందులో తండ్రికూతుళ్లుగా నటించారు. అలా ఈ సినిమాకు ఓ ప్రత్యేకత వచ్చింది. ఇంతకీ ఇందులో శివానీని ఎందుకు తీసుకున్నారు? సినిమాపై బజ్ కోసం ఈ పని చేశారా లేక ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా?
“రాజశేఖర్ గారూ శివాని ఇద్దరూ ఈ సినిమాలో ఉన్నా కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు. ఇద్దరి పాత్రలు బాగా వచ్చేవరకు తీశాను. ఈ మూవీలో డాటర్ కు చిన్న ఇంపార్టెంట్ రోల్ ఉందని ఇద్దరు కూతుళ్ళు శివాని,శివాత్మిక చెప్పడం జరిగింది. అయితే శివాని చేస్తానని చెప్పడం జరిగింది. డాటర్ కి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొత్త అమ్మాయిను తీసుకొచ్చి వారి మధ్య డాటర్, ఫాదర్ రిలేషన్ బిల్డప్ చేయడం కంటే శివాని డాటర్ గా చేస్తే బాగుంటుందని తనతో చేయించడం జరిగింది.”
ఇలా శివానీని తీసుకోవడం వెనక ప్రత్యేక కారణాన్ని బయటపెట్టారు దర్శకురాలు జీవిత రాజశేఖర్. కేవలం క్రేజ్ కోసం శివానీని తీసుకురాలేదని.. తక్కువ టైమ్ లో తండ్రికూతుళ్ల రిలేషన్ షిప్ ను ఎలివేట్ చేయడానికి ఈ పని చేశామని చెప్పుకొచ్చారు. సినిమాలో ఈ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయంటున్నారు జీవిత.
మలయాళంలో సూపర్ హిట్టయిన జోసెఫ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది శేఖర్. జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, 20న థియేటర్లలోకి వస్తోంది. అనూప్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.