ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత.. కాంగ్రెస్ హయాంలో వరంగల్ రాజకీయ చరిత్రలో తిరుగులేని నేతగా పేరు తెచుకున్న నాయకుడు.. అలాంటి నాయకుడు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? సంకల జనుల సమ్మె అనంతరం తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె జరిగినా ఉత్సహంగా పాల్గొనకుండా అంటీ ముట్టనట్లు ఉండడానికి కారణాలేంటి? ఇంతకీ ఎవరా నేత? ఆ నేత మౌనం వెనుక కారణాలేంటి?
తెలుగు రాష్ట్ర ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు పొన్నాల లక్ష్మయ్య. 5 సంవత్సరాల క్రితం రాజకీయాల్లో అయన బిగ్ బాస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వరంగల్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. నాలుగు సార్లు శాసన సభ్యులుగా ఎన్నికై మూడు సార్లు మంత్రి పదవులను చేపట్టడమే కాకుండా భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవితో తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నేత పొన్నాల. ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక మొదటి టీపీసీసీ అధ్యక్ష పదివిని సైతం చేపట్టినా.. కాంగ్రెస్ లో అయన రాజకీయ భవిషత్తు చెదిరిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఒకప్పుడు టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉండి ఎంతో మందికి తన చేతుల మీదుగా బీ ఫారంలు అందించిన పొన్నాల, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తనకే మొదటి లిస్ట్ లో బి ఫామ్ దక్కని పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్టం ఏర్పడిన అనంతరం 2014లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ జిల్లా నుండి పోటీ చేసిన పొన్నాల టీఆరెఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతగా టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో కూడా పొన్నాల పరాజయం కావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సందిగ్ధంలో పడింది.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారం చేజిక్కించుకోలేక పోవడం.. మరి ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర పరాజయ పాలవడంతో టీపీసీసీ అద్యేక్ష పదవి నుండి పొన్నాలను తప్పించింది. బీసీ నాయకత్వం కన్నా రెడ్డి నాయకత్వం ముఖ్యం అని భావించిన కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అథ్యక్షునిగా ఎన్నుకుంది. దీంతో అప్పటినుండి పొన్నాల తీవ్ర నిరాశలో ఉన్నట్టు అయన సన్నిహితులే చెప్పుకుంటున్నారు.
ఇక 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన అధికార పార్టీ…కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలకు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ , టీడీపీ, టీజేఎస్, సిపిఐ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డా కాంగ్రెస్ కు పరాభవం తప్పలేదు. జనగామ నియోజకవర్గం నుండి టికెట్ పొందడానికి పొన్నాల చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. మొదటగా ఆ టికెట్ ను కూటమి తరపున టీజేఎస్ అధినేత కోదండరాం కు ఇస్తారని ప్రచారం జరగగా పొన్నాల అనుచరుల్లో ఆందోళన మొదలైంది. సీనియర్ నేత, మాజీ టీపీసీసీ అధ్యక్షులైన పొన్నాల కు టికెట్ ఇవ్వకుండా వేరే వారికి ఎలా ఇస్తారని కొద్దిరోజులు చర్చలు జరిగాయి. ఫలితంగా చివరికి జనగామ టికెట్ పొన్నాల లక్ష్మయ్యకు దక్కింది కానీ ఫలితాలు మాత్రం మారలేదు.అదే టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో రెండోసారి ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పొన్నాలను పార్టీకి దూరంగా పెట్టిందని ప్రచారం జోరుగా సాగింది. దీంతో సందిగ్ధంలో పడ్డ పొన్నాలకు వరుస పరాజయాలు, కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన పొన్నాల ఇప్పుడు పార్టీ ఉన్నత పదవులు కోల్పోయి పార్టీకి అంటి అంటనట్టుగా ఉంటున్నారు. తన బిజినెస్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్న పొన్నాల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ కార్మికులు చేసిన ఆందోళనలో మాత్రం అంత చురుగ్గా పాల్గొన లేదు. సకల జనుల సమ్మె తరువాత అంతటి పెద్ద సమ్మె కు దిగిన ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నా పొన్నాల మాత్రం అంతంత మాత్రంగానే పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న పొన్నాల పార్టీ నేతలను, నాయకులను కలుపుకొని కార్మికులకు అండగా నిలువాల్సిన సమయంలో ఏదో సమ్మె లో పాల్గొన్నామా లేదా అనే విధంగా అక్కడక్కడా కనిపిస్తూ ప్రెస్ మీట్ లతో సమ్మె కాలాన్ని నెట్టుకొచ్చారు.మరి పొన్నాలకు వయసు భారంతో ఆరోగ్యం సహకరించక ఇలా చేస్తున్నారా? లేకా అధిష్టానం చల్లని చూపు లేదని అధైర్య పడుతున్నాడా? తనకున్న బిజినెస్ లు చూసుకుంటూ రాజకీయంలోంచి పూర్తిగా తప్పుకొని తన రాజకీయ వారసురాలిగా ఎన్నోసార్లు కూతురు వైశాలిని తీసుకురావాలనుకున్న పొన్నాల.. 2014 నుంచే కూతురు వైశాలికి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా బి ఫామ్ ఇప్పించాలని ఆశపడి బంగాపడ్డారు. ఇప్పుడు తన కుమార్తె వైశాలి రాజకీయ భవిష్యత్తు కోసమే ఆలోచిస్తున్నట్లు జనగామ నియోజకవర్గంలో టాక్.
ఇక రాజకీయాల్లో పదవులు, అధికారాలు శాశ్వతం కాదని చెప్పడానికి పొన్నాల ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.. మరి పొన్నాల తన రాజకీయ జీవితంలో, బిజినెస్ లలో సక్సెస్ అయినట్లుగా కూతురు వైశాలిని రాజకీయంలోకి తీసుకురావడంలో సక్సెస్ అవుతారా? అధికార పార్టీ అయిన టీఆరెస్ ను ఎదురుకొనలేక తన వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయాలను వదిలేసి పూర్తిగా బిజినెస్ మెన్ గా అవతారం ఎత్తుతారో చూడాలి మరి!