ప్రతి ఏడాది మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లోనూ గణేష్ ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతాయన్న సంగతి తెలిసిందే. 9 రోజుల పాటు గణనాథులను మండపాల్లో పూజించి అనంతరం అంగరంగ వైభవంగా ఉత్సవాల నడుమ నిమజ్జనాలు చేస్తారు. ఇక కేవలం వినాయక చవితి అప్పుడు మాత్రమే కాదు, ఏదైనా శుభకార్యం తలపెట్టినా, వ్యాపారం ప్రారంభించినా ముందుగా గణపతి పూజ కచ్చితంగా చేస్తారు. దీంతో ఏ పనైనా ఎలాంటి విఘ్నాలు, అవంతరాలు ఎదురు కాకుండా పూర్తవుతుందని, అందులో విజయం సాధిస్తామని భక్తులు నమ్ముతారు. అందుకనే అందరు దేవుళ్ల కన్నా ముందు గణపతికే తొలి పూజ చేస్తారు.
అయితే మనం అప్పుడప్పుడు భిన్న రకాల ఆకృతుల్లో ఉండే వినాయక విగ్రహాలను చూస్తుంటాం. కొన్ని విగ్రహాలకు తొండం ఎడమ వైపు ఉంటే కొన్ని విగ్రహాలకు తొండం కుడి వైపుకు ఉంటుంది. కొన్నింటికి నేరుగా ఏ వైపుకు వంగకుండా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుంది ? దీని వల్ల మనకు ఏమైనా జరుగుతుందా ? తొండం ఏ వైపుకు ఉన్న గణనాథున్ని పూజిస్తే ఏం జరుగుతుంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తొండం ఎడమ వైపుకు ఉంటే…
శివపార్వతుల ఒడిలో కూర్చుని ఉండే గణనాథుని తొండాన్ని ఎప్పుడైనా గమనించారా ? అది ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. కనుక చాలా మంది ఎడమ వైపుకు తొండం తిరిగి ఉండే గణనాథున్నే పూజిస్తారు. ఈ గణనాథుడు సాధు స్వభావం ఉన్నవాడని చెబుతారు. ఇదా నదికి ప్రతిరూపమని అంటారు. ఈ తరహా వినాయకులను ఇండ్లలోనే పూజిస్తారు. దీని వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఈ గణనాథులు సహజంగా మనకు ఆలయాల్లో కనిపించరు. ఇలా తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండే గణనాథులను కేవలం ఇండ్లలోనే పూజిస్తారు.
తొండం కుడి వైపుకు ఉంటే..
తొండం కుడి వైపుకు తిరిగి ఉండే గణనాథులను కేవలం ఆలయాల్లోనే పూజిస్తారు. ఇండ్లలో పూజించకూడదు. ఈ గణనాథుడు ఉగ్ర రూపం ఉన్నవాడని చెబుతారు. అందువల్ల సరిగ్గా పూజిస్తే కోరిన కోర్కెలు వెంటనే తీరుతాయని అంటారు. అందుకనే ఈ గణనాథున్ని సిద్ది వినాయకుడు అని కూడా పిలుస్తారు. ముంబైలోని సిద్ది వినాయకుడి గుడి ఇందుకే ఫేమస్ అయ్యింది. ఈ తరహా వినాయక విగ్రహాలు కేవలం ఆలయాల్లో మాత్రమే ఉంటాయి. ఇండ్లలో ఉండవు, తెచ్చుకుని పూజించకూడదు. ఈ వినాయకున్ని పింగళ నదికి ప్రతిరూపంగా భావిస్తారు.
తొండం నేరుగా ఉంటే…
తొండం నేరుగా ఉండే వినాయక విగ్రహాలు మనకు అత్యంత అరుదుగా కనిపిస్తాయి. కేవలం నవరాత్రి ఉత్సవాల సందర్బంగా మాత్రమే కొందరు ఈ వినాయకులను పూజిస్తారు. ఎక్కువగా ఈ వినాయకులను బహుమతులుగా ఇచ్చుకుంటారు. ఈ వినాయకుడు సుషుమ నదికి ప్రతిరూపమని చెబుతారు. ఈ గణనాథున్ని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని అంటారు.