కరోనా వైరస్ ప్రభుత్వాన్ని ఎంత గడగడలాడిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షల కోట్ల నష్టంతో దేశం మొత్తం స్తంభించింది పోయింది. ప్రతి రోజు వందలాది కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇండియా వంటి అత్యధిక జనసాంద్రత కలిగిన దేశంలో ఒక్కసారి ప్రజల సముహాలకు కరోనా వైరస్ అంటుకుంటే ఎంత ప్రమాదమో, అసలు ఇండియాలో మనుషులు మిగులుతారో లేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కానీ ప్రభుత్వాలు మాత్రం పైకి అది చేశాం, ఇది చేశాం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా, వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం… అవసరమైతే ఇంకా కూడా ఖర్చు చేస్తాం అని ప్రకటనలు జారీ చేస్తున్ఆన… వైరస్ నిర్మూలనలో ప్రభుత్వాల ఉదాసీన వైఖరి స్పష్టంగా కనపడుతూనే ఉంది. ముఖ్యంగా దేశాన్ని సాదుతున్నాం అని చెప్పుకునే రాష్ట్రాలు, అభివృద్ది చెందుతున్న దేశంలో అభివృద్ది చెందిన రాష్ట్రాలం అని చెప్పుకునే చోటే పరిస్థితి దారుణంగా ఉంది.
ఏపీలో 180 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ప్రార్థనల తర్వాత ప్రజా సముహాంలోకి కరోనా వైరస్ వచ్చిందా అన్న భయం వెంటాడుతున్న దశలో కరోనా టెస్టులు ఎక్కువగా చేయాలి. కానీ ఏపీలో శుక్రవారం వరకు చేసిన టెస్టులు కేవలం 1800. ఇందులో ఇద్దరు చనిపోగా, 4గురు కోలుకున్నారు. ఇంకో 445 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది.
ఇక తెలంగాణలో అయితే ఎన్ని టెస్టులు జరిగాయో, ఎన్ని చేస్తున్నారో స్పష్టత ఇచ్చే నాథుడే లేరు. 2500 టెస్టులు చేశాం అన్నది తెలుస్తుంది. ఇందులో 229 పాజిటివ్ కేసులు, 11మరణాలు, 32మంది కోలుకున్నారు. కానీ జీహెచ్ఎంసీ వంటి ప్రాంతాలున్న చోట ఇవి ఏమూలకు సరిపోతాయో ప్రభుత్వాలకే తెలియాలి. కానీ ప్రకటనలు మాత్రం ఎంత గొప్పగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక కేరళ రాష్ట్రం కరోనా దెబ్బకు ముందు నుండి చిగురుటాకుల వణికిపోతూనే ఉంది. కేరళలో 9139 టెస్టులు చేయగా… ఇప్పటి వరకు 295 కేసులు, 42 మంది కోలుకోగా… ఇద్దరు మరణించారు. మరో 718మంది సాంపుల్స్ రిపోర్టులు రావాల్సి ఉంది. ఇక తమిళనాడు పరిస్థితి మరీ ఘోరం. అక్కడ 411 పాజిటివ్ కేసులు నమోదయితే… 3684 టెస్టులు మాత్రమే చేశారు. మరో 484మంది రిపోర్టులు రావాల్సి ఉంది.
ఇక కర్ణాటక రాష్ట్రంలో 4587మందికి టెస్ట్ చేయగా 128 మంది కరోనా బారిన పడ్డారు. 11 మంది కోలుకున్నారు. వీరితో పోల్చితే మహారాష్ట్ర కాస్త బెటర్ గా కనిపిస్తోంది. మహారాష్ట్రలో 12858 టెస్టులు చేయగా… 490మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. 50 మంది కోలుకోగా… 26మంది చనిపోయారు.
అంటే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కేవలం 69వేల టెస్టులే చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో… వీలైనంత ఎక్కువగా టెస్టులు చేసి వైరస్ వ్యాప్తి అరికట్టే లాక్ డౌన్ వంటి కీలక సమయంలో… టెస్టులు చేయటంపై ప్రభుత్వాలు ఉదాసీన వైఖరి కనపర్చుతున్నాయి. టెస్టులు చేయటం ఖర్చుతో కూడుకున్న పని పక్కన పెడుతున్నారా…? వైరస్ అంత దూరం వెళ్లి ఉండదు అన్న భ్రమలో ఉన్నారో వారికే తెలియాలి.
కానీ కరోనా వైరస్ విజృంభిస్తున్న దేశాల్లో నివారణ చర్యలను చూసినా, చైనా దేశంలో పరిస్థితులు గమనించినా… ప్రపంచ వైద్యారోగ్య సంస్థ సలహా చూసినా… టెస్ట్, టెస్ట్, టెస్ట్ అనే పదమే ఎక్కువగా వినపడుతోంది.