హీరో సుమంత్ చాలా సినిమాలు చేశాడు. మరి ఆయనకు సినిమా నిర్మించాలనే ఆలోచన లేదా? ఎందుకంటే, అతడికంటూ అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ పై సొంతంగా సినిమా తీయొచ్చు. కానీ అలాంటి పనులు చేయనంటున్నాడు సుమంత్. అన్నపూర్ణ స్టుడియోస్ తో తనకు అసోసియేషన్ ఉందని, కానీ సినిమాలు మాత్రం నిర్మించనని చెబుతున్నాడు. ప్రొడక్షన్ పై సుమంత్ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి..
నాకు సినిమాలు నిర్మించడం ఇష్టం లేదు. ప్రొడక్షన్ పై అంత ఆసక్తి లేదు. మాకు స్టుడియో ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ కేవలం స్టుడియో ఉంటే నిర్మాణానికి సరిపోదు. ఇంకా చాలా విషయాలు ఎగ్జిక్యూట్ చేయాలి. నిర్మాణం అనేది చాలా కష్టమైన పని, పైగా రిస్క్ తో కూడుకున్నది. అందుకే నేను నిర్మాణంలోకి అడుగుపెట్టను.
నేను బయట నిర్మాతలతోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నాను. ఒకవేళ వాళ్లకు నా నుంచి ప్రొడక్షన్ పరంగా సహకారం కావాల్సి వస్తే, అన్నపూర్ణ స్టుడియోస్ నుంచి ఆ సహకారం తప్పకుండా ఉంటుంది. కనీసం వ్యక్తిగత స్థాయిలోనైనా నా సహాయం నేను తప్పకుండా చేస్తాను. ఎందుకంటే, నిర్మాతలే దేవుళ్లు అని తాతగారు ఎప్పుడూ అంటుంటారు. దాన్ని నేను కూడా నమ్ముతాను.
అన్నపూర్ణ స్టుడియోస్ బోర్డ్ లో నేను కూడా ఉన్నాను. నిర్మాణం పరంగా, అకాడమీ పరంగా ఏం జరుగుతుందో ప్రతిదీ నాకు తెలుస్తుంది. మీటింగ్స్ కు కూడా వెళ్తాను. కాకపోతే సుప్రియ అంత యాక్టివ్ గా నేను ప్రొడక్షన్ లో ఉండను. ఆ మాటకొస్తే, నాగార్జున, నాగచైతన్య కంటే సుప్రియనే ప్రొడక్షన్ లో యాక్టివ్.