ఏదోక సందర్భంలో తమిళనాడు వాళ్ళను అరవ వాళ్ళు అని వాళ్ళు మాట్లాడే భాషను అరవ భాష అని అనడం మనం వినే ఉంటాం. అసలు అరవ అనే మాట ఎందుకు వచ్చింది…? వాళ్ళను అరవ వాళ్ళు అని ఎందుకు అంటారు అనేది ఒకసారి చూద్దాం.
పూర్వం తమిళ ప్రాంతాలను ‘మండలం’ అనే పేరుతో పిలిచే వారు. చోళ మండలం, పాండ్య మండలం ఈ విధంగా పిలవగా… అటువంటిదే ”తొండై మండలం” అనేది కూడా ఉంది., ఈ తొండై మండలంలో ఉండేదే అరువనాడు. ఈ ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ కు దక్షినాన ఉండేది. ఈ అరువనాడు ప్రస్తుత ఏపీలోని చిత్తూరు, నెల్లూరులోని కొంత భాగం వరకు విస్తరించి ఉంది. తెలుగు వారికి అతి సమీపంలో ఉన్న రాజ్యం అరవనాడు కావున… వాళ్ళను అరవ ప్రజలు అనే వాళ్ళు.
వాళ్ళు మాట్లాడే భాష మనకు అర్ధం అయ్యేది కాదు. కాబట్టి దాన్ని అరవ భాష అని పిలిచే వారు. ఇక తమిళనాడు వాళ్ళను కేరళ, కర్ణాటక వాళ్ళు కూడా అలాగే నిక్ నేమ్ తో పిలుస్తూ ఉంటారు. కన్నడిగులు తమిళులను కొంగ అని పిలుస్తూ ఉంటారు. కొంగునాడు అనే ప్రాంతం కర్నాట దేశానికి సరిహద్దుల్లో ఉండేది. ఆ ప్రాంతం వారిని కొంగ అని పిలిచే వారు కర్ణాటక ప్రజలు. ఇక మలయాళీలు తమిళులను పాండీ అని పిలిచే వారు. వీరికి పాండ్యనాడు సరిహద్దు ప్రాంతం కాబట్టి… పాండ్యనాటి తమిళులను పాండీ అని మలయాళీలు పిలుస్తూ ఉంటారు.