కరోనా వైరస్ పై పోరాటంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ముందు నుండి వివాదాస్పదంగానే ఉన్నాయి. హైకోర్టు ఆక్షింతలు వేస్తూ… అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు పెట్టాలంటూ కూడా ఆదేశించింది. కరోనా సెకండ్ వేవ్ తప్పదన్న హెచ్చరికలు ఓవైపూ, కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి భయం మరోవైపు ఉండటంతో దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి.
కేరళ రాష్ట్రంలో రాత్రి 10గంటల తర్వాత ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
ముంబై సిటీలో రాత్రి 11గంటల నుండి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
కర్ణాటక రాష్ట్రంలో గురువారం సాయంత్రం 6గంటల నుండి శుక్రవారం సాయంత్రం 6గంటల వరకు ఆంక్షలు విధించారు.
ఢిల్లీలో రాత్రి 11గంటల నుండి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ- రాత్రి 8గంటల నుండి పలు ప్రాంతాల్లో ప్రజలకు అనుమతి నిరాకరణ
కానీ తెలంగాణలో మాత్రం రాత్రి 12గంటల వరకు వైన్స్ షాపులు, రాత్రి 1గంటల వరకు పబ్బులు, బార్లు ఓపెన్ చేసుకునేందుకు సర్కార్ వెసులుబాటు ఇచ్చింది. అంటే కరోనా వైరస్ పై ఆంక్షలను గాలికొదిలేసిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పైగా అర్ధరాత్రి వరకు మందుబాబులను తాగమని సర్కారే చెప్పి… తెల్లవారే వరకు డ్రంకన్ డ్రైవ్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు చూస్తుందని మండిపడుతున్నారు. రాష్ట్రంలో అసలే కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదు కాగా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వివాదాస్పదంగా మారాయి. కేంద్రం కూడా న్యూ ఇయర్ వేడుకల్లో ఆంక్షలు విధించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది.