ప్రజల ప్రాణాల కంటే తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికలే ఎక్కువైపోయాయి. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వందలకొద్ది అమాయకులు చనిపోతోంటే.. అధికార పార్టీ నేతలు మాత్రం ఓట్లు, సీట్ల వేటలో పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఎలాగైనా ఉండని, బెడ్లు దొరక్క ఎంత మంది అయినా చావనీ.. అసలు ఆ బాధ్యతే తమది కాదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. కరోనా మాట ఎత్తొద్దని అనుకుంటున్నారేమో.. ఒక్కరంటే ఒక్కరు రాష్ట్రంలో పరిస్థితిని పట్టించుకున్నవారే లేకుండాపోయారు.
నామ్‌కేవాస్త్.. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల మినహా.. ముఖ్యమైన మంత్రులంతా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనే మునిగి తేలుతున్నారు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ ఎన్నికలు నిర్వహించరేమో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తూ మున్సిపల్ ఎన్నికలు జరిగే వరంగల్‌లోని ఎంజీఎంలో రెండు రోజుల వ్యవధిలోనే కరోనా కారణంగా 16 మంది మృత్యువాతపడ్డారు. సరైన వైద్యం దొరకడం లేదని కరోనా సోకిన బాధితులు రోడ్డెక్కే దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కానీ అవేం పట్టించుకునే పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలు లేరు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా బెడ్ల కొరత లేనే లేదని.. 60 వేల బెడ్లు రెడీగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా.. ఆవన్నీ ఉత్తమాటలే అనిపిస్తున్నాయి. తాజాగా కరోనా కారణంగా సీరియస్‌గా ఉన్న తన తల్లిని అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చిన మేడ్చల్ జిల్లా శామీర్‌పేటకు చెందిన ఓ యువకుడు..పట్టించుకునేవారు లేక కళ్లముందే ఆమె చావును చూశాడు. కాపాడమని దీనంగా అర్థించినా సిబ్బంది కరుణించకపోవడంతో.. అదే అంబులెన్స్‌లో ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ దుస్థితికి కారణం ఏమాత్రం కాదు.. ముమ్మాటికి ప్రభుత్వం నిర్లక్ష్యమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చావులను సర్కారే సమాధానం చెప్పాల్సిన అసవరముంది.