సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామన్నది ఉద్యమం నాటి హామీ. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 10జిల్లాల తెలంగాణను 2016లో 31 జిల్లాల తెలంగాణగా ఏర్పాటు చేశారు. కానీ అప్పుడే గిరిజనులంతా ములుగును జిల్లా కూడా చేయాలని, ఉమ్మడి మహబూబ్ నగర్ లోని నారాయణపేటను జిల్లా చేయాలని కోరారు. ఉద్యమాలు జరిగాయి. రోడ్లపై వంటా-వార్పు కూడా చేశారు. కానీ సర్కార్ పట్టించుకోలేదు.
31జిల్లాలతోనే కొత్త జోనల్ పద్ధతిని మార్చారు. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపటం… కేంద్ర హోంశాఖ కొత్త జిల్లాలను గుర్తించటంతో పాటు రాష్ట్రపతి కూడా 31 జిల్లాల తెలంగాణలోని జోనల్, మల్టి జోనల్, జిల్లాలను ఆమోదించారు. కానీ 2018 ముందస్తు ఎన్నికల హామీతో ములుగు, నారాయణపేట జిల్లాలను 2019లో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలు మనుగడలోకి వచ్చాయి. జోనల్, మల్టి జోనల్ లో మార్పులు జరిగాయి. అదే అంశాన్ని రాష్ట్రపతి వద్దకు ఫైలు పంపారు. ఇంత వరకు బాగానే ఉన్నా… దాదాపు రెండు సంవత్సరాలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న ఫైలును సర్కార్ ఎందుకు క్లియర్ చేయించుకోలేదు అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.
చిన్న చిన్న అంశాలకే ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్ ఢిల్లీ పంపుతారు. పెండింగ్ ఫైల్ ను మూ చేయించేలా చూస్తారు. అదీ సాధ్యపడకపోతే తనే రంగంలోకి దిగుతారు. కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాక చాలా సార్లు ఢిల్లీ వెళ్లారు. అంతెందుకు 50వేల పోస్టుల భర్తీ నిర్ణయానికి ఒక్క రోజు ముందు కూడా కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేసి వచ్చారు. కానీ 33జిల్లాల జోనల్, మల్టి జోనల్ ను ఆమోదించే ఫైలు కదల్లేదు. వీరు కూడా అడగలేదని, వీరికి అంత అవసరం లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ రెండు జిల్లాల ప్రజలకు, నిరుద్యోగ యువతకు కేసీఆర్ ఏం సమాధానం చెప్తారని, 31జిల్లాల తెలంగాణ అప్పుడు చూపిన స్పీడ్ ఇప్పుడు ఎందుకు చూపలేదని… రెండేళ్లుగా ఎందుకు ఈ సవతి తల్లి ప్రేమ చూపారని నిరుద్యోగ సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.